సిపిఎం ఆఖిల భారత విస్తృత సమావేశాలు - ఆగస్ట్ 7నుండి 12వరకు విజయవాడలో...
సిపిఎం ఆఖిల భారత విస్తృత సమావేశాలు - ఆగస్ట్ 7నుండి 10వరకు విజయవాడలో...
సిపిఎం అఖిల భారత విస్తృత సమావేశాలు విజయవాడలో ఉత్సాహపూరితంగా ఉత్తేజభరితంగా శనివారం ప్రారంభ మయ్యాయి. ఈ సమావేశాలకు దేశం నలుమూలల నుండి విచ్చేసిన కమ్యూనిస్ట్ నాయకులకు, సమావేశ సంరంభాలను వీక్షించేందుకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలనుండి తరలివచ్చిన కమ్యూనిస్టు యోధులు, యువ కమ్యూనిస్టులు, మహిళా నేతలు, శ్రేయోభిలాషులకు విప్లవాభివందనాలు...
Saturday, April 11, 2009
అక్కడా, ఇక్కడా అప్రతిష్ట విధానాలే : ‘మీట్ ద ప్రెస్’లో రాఘవులు
Thursday, April 2, 2009
మార్క్సిస్టు మహా రథికుడు ఇ.ఎం.ఎస్. - తెలకపల్లి రవి
ఇరవయ్యో శతాబ్ది ప్రపంచ రాజకీయ యవనికపై ఇ.ఎం.ఎస్. నంబూద్రిపాద్‌ది విలక్షణ స్థానం. ఎన్నికల బాటపట్టి ముఖ్యమంత్రి పీఠమెక్కిన మొదటి కమ్యూనిస్టుగా ఇ.ఎం.ఎస్. చరితార్థుడు. కాంగ్రెస్ గుత్తాధిపత్యానికి తొలి గండి కొట్టిన ఉద్దండుడు. సిద్ధాంతకర్తగా, పాలనావేత్తగా బహుముఖ ప్రజ్ఞ కనబరచి కమ్యూనిస్టు ఉద్యమానికి కొత్త వూపిరులూదిన నంబూద్రి సిసలైన మహారథికుడు.
ఎలంకులం మనక్కర్ శంకర నంబూద్రిపాద్... దేశంలో అరవయ్యేళ్లపాటు కమ్యూనిస్టు ఉద్యమానికి ఈ పేరు జీవనాడి. డెబ్భై ఏళ్ల కిందటే ఎన్నికల్లో పోటీచేసి 1939లో కేరళ శాసనసభకు ఎన్నికైన సముజ్వల అరుణతార ఇ.ఎం.ఎస్.నంబూద్రిపాద్. సనాతన ఆచార వ్యవహారాలకు కట్టుబడిన, సంపన్న భూస్వామ్య కుటుంబంలో జన్మించిన ఇ.ఎం.ఎస్. అలుపులేని సేవానిరతితో కేరళ ప్రజలకు ప్రియతమ నాయకుడయ్యారు. ఇ.ఎం.ఎస్. 1909 జూన్ 14న కేరళ దక్షిణ మలబార్ ప్రాంతంలోని ఎలంకులం గ్రామంలో జన్మించారు. వేద విద్యలను నిష్ఠగా అభ్యసించిన బాల్యం నంబూద్రిది. సోదరుడితోపాటు 1925లో పాఠశాలకు వెళ్ళడం మొదలుపెట్టిన తరవాతే సమాజ స్థితిగతులపై ఆయనకు అవగాహన పెరిగింది. క్రమంగా ఆయన సంఘ సంస్కరణ, స్వాతంత్ర పోరాటంపట్ల ఆకర్షితులయ్యారు. 1932లో కళాశాల విద్యకు మధ్యలోనే స్వస్తి పలికి జాతీయోద్యమ పథం పట్టారాయన. ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని జైలు శిక్షను అనుభవించారు. అక్కడే ఆయనకు కేరళ కమ్యూనిస్టు పార్టీ వ్యవస్థాపకుడు కృష్ణపిళ్త్లెతో, బెంగాల్‌కు చెందిన విప్లవకారులతో పరిచయం ఏర్పడింది. జైలునుంచి విడుదయ్యాక కాంగ్రెస్‌లోని వామపక్షంవైపు ఇ.ఎం.ఎస్. దృష్టిసారించారు.
శ్రామిక ప్రజల దత్త పుత్రుడు
కాంగ్రెస్‌లో అంతర్భాగంగా 1934లో కాంగ్రెస్ సోషలిస్టు పార్టీ ఆవిర్భవించినప్పుడు నంబూద్రి దాని ప్రధాన కార్యదర్శుల్లో ఒకరు. మద్రాసులో కృష్ణపిళ్త్ల్లెె, సుందరయ్యలతో 1935లో సుదీర్ఘ చర్చలు జరిపిన తరవాత కమ్యూనిస్టు పార్టీ స్థాపనకు ఆయన నడుం బిగించారు. అప్పుడు దానిపై నిషేధం ఉంది. వైనాడ్‌లో పేదల ఇళ్లలో గడిపి వారి పరిస్థితుల పట్ల ప్రత్యక్ష అవగాహన ఏర్పరచుకున్నారు. సంపన్న సనాతన కుటుంబంలో పుట్టినా- తాను శ్రామిక ప్రజల దత్త పుత్రుడనేనని సగర్వంగా ప్రకటించుకున్నారు. కాంగ్రెస్ తరఫున 1939లో మద్రాసు శాసనసభకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆ శాసనసభ కొద్ది కాలమే ఉంది. స్వల్పకాలంలోనే బాధ్యతల నిర్వహణలో భాగంగా కౌలుదార్ల సమస్యలపై సమగ్రంగా అధ్యయనం చేసి వారి విముక్తికి ఉపయోగపడే నివేదికను రూపొందించారు నంబూద్రి. కృష్ణపిళ్త్లె 1940లో అరెస్టు కావడంతో ఇ.ఎం.ఎస్. రాష్ట్ర కమ్యూనిస్టు కార్యదర్శిగా ఎంపికయ్యారు. తనపై అరెస్టు వారెంటు ఉన్నా, నత్తి కారణంగా ఎవరైనా తనను తేలిగ్గా పట్టుకునే అవకాశం ఉన్నా చివరివరకూ దొరక్కుండా అజ్ఞాతవాసం గడిపారు. రహస్య జీవితంలోనే మార్క్సిస్టు గ్రంథాలను, సాహిత్య పుస్తకాలను విపరీతంగా చదివారాయన. కేరళ సమాజ స్థితిగతులు, ఆర్థిక రాజకీయాంశాలను సమగ్రంగా అధ్యయనం చేశారు. ఎలాంటి బాధ్యతలు నిర్వహిస్తున్నప్పటికీ ఆయన తన జీవిత పర్యంతం అధ్యయన శీలతను మాత్రం వీడలేదు. అసంఖ్యాకంగా పుస్తకాలు చదువుతూ విస్తృతంగా రచనలు చేశారాయన. ప్రజా ఉద్యమాల్లో క్రియాశీల రాజకీయాల్లో ఉంటూ అంత విస్తారంగా రచనలు చేసిన నాయకుడు దేశంలో మరొకరు కనిపించరు.
భూ సంస్కర్త
మద్రాసు శాసనసభకు 1952 ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన నంబూద్రి కొన్నేళ పాటు ఢిల్లీలో కమ్యూనిస్టు పార్టీ కేంద్ర కార్యాలయంలో ఉన్నారు. ఆ సందర్భంగా అనేక విషయాలను ఆకళింపు చేసుకున్నారు. విదేశీ ప్రతినిధులతో తరచూ సమావేశాలలో పాల్గొనడంవల్ల అంతర్జాతీయ ఉద్యమంతోనూ మంచి సంబంధాలు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యమే ఆయనకు 1957 ఎన్నికల్లో కేరళలో కాంగ్రెస్‌పై ఘనవిజయం సాధించి పెట్టింది. అధికారంలోకి రాగానే భూ సంస్కరణలను అమలు చేశారు. భూస్వామ్య వ్యవస్థ నడ్డి విరిచేశారు. కార్మికోద్యమాలు, ప్రజాందోళనలపట్ల పోలీసులు క్రూరంగా వ్యవహరించడాన్ని ఇ.ఎం.ఎస్. తీవ్రంగా తప్పుపట్టారు. ఆయన ప్రభుత్వం ఏర్పరచిన పునాదే నేడు అక్షరాస్యతలో కేరళ దేశంలోనే అగ్రస్థానం సాధించడానికి కారణమైంది. విద్యాసంస్థల్లో విద్యార్థుల, ఉపాధ్యాయుల ప్రయోజనాలను లక్షించి ఇ.ఎం.ఎస్ ఓ బిల్లు ప్రవేశపెట్టారు. ఆధిపత్యాన్ని వదులుకోవడానికి ఏ మాత్రం ఇచ్ఛగించని మత, వ్యాపార వర్గాలు ఇం.ఎం.ఎస్. సర్కారుకు వ్యతిరేకంగా పెద్ద రభస చేశాయి. నాడు కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఉన్న ఇందిర-నెహ్రూ ఆశీస్సులతో విమోచన ఉద్యమం మొదలుపెట్టారు. ఈ శక్తులకు ఊతంగా నిలిచారు. శాంతి భద్రతలు దిగజారాయన్న మిషతో 356వ అధికరణం ప్రయోగించి 28 మాసాలు పాలించిన ఇ.ఎం.ఎస్. ప్రభుత్వాన్ని 1959లో కేంద్రం రద్దు చేసింది. రాష్ట్రాల హక్కులపై దేశ చరిత్రలో పడిన తొలి వేటు అది.
ఈ మధ్యకాలంలో కమ్యూనిస్టు ఉద్యమంలో సైద్ధాంతిక విభేదాలు తీవ్రరూపం దాల్చాయి. అదే సమయంలో కార్యదర్శి అజయ్‌ఘోష్ చనిపోయారు. ఆ పరిస్థితుల్లో అందరికీ ఆమోదయోగ్యమైన నాయకుడుగా ఇ.ఎం.ఎస్.ను కార్యదర్శిగా, డాంగేను ఛైర్మన్‌గా ఎన్నుకున్నారు. కాని ఆ సయోధ్య ఎక్కువకాలం సాగలేదు. తరవాతి కాలంలో సి.పి.ఎం.గా గ్రూపు కట్టనున్న నాయకులందరినీ ప్రభుత్వం అరెస్టు చేసింది. వారిలో ఇ.ఎం.ఎస్. కూడా ఉన్నారు. అంతర్జాతీయ ఒత్తిడి పెరగడంతో కొద్ది కాలంలోనే ఆయనను మాత్రం విడుదల చేశారు. 1964లో సి.పి.ఎం. ఏర్పడినప్పుడు తొలి పొలిట్‌బ్యూరో సభ్యుడిగా, ప్రధాన సైద్ధాంతిక మార్గదర్శిగా ఇ.ఎం.ఎస్. అసమాన ప్రజ్ఞ కనబరచారు. 1965లో కేరళ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో మరోసారి విజయం సాధించారు. కానీ- సి.పి.ఎం. తరఫున ఎన్నికైన వారంతా జైళ్లలో ఉండటంవల్ల ప్రమాణ స్వీకారం చేయడం కుదరలేదు. దానితో ఎన్నికలనే రద్దు చేశారు. అనంతరం 1967లో మరోసారి ఆయన వామపక్ష సంఘటన తరఫున కేరళ ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన ప్రభుత్వం ఇంచుమించుగా మూడేళ్లు ఉంది. గతంలో అసంపూర్ణంగా మిగిలిపోయిన అనేక ప్రజానుకూల విధానాలను ఆ సందర్భంగా ఇ.ఎం.ఎస్. పరిపూర్తి చేశారు. ఏడో దశకంలో రెండు పర్యాయాలు కేరళ శాసనసభకు ఎన్నికైనప్పటికీ ఇ.ఎం.ఎస్. ప్రధానంగా జాతీయస్థాయిలో సి.పి.ఎం. నాయకత్వ బాధ్యతలపైనే ఎక్కువ దృష్టి పెట్టారు. పార్టీలో సైద్ధాంతిక వివాదాలు తీవ్రమవుతున్న కాలమది. మరోవంక ఇందిర ఏకపక్ష నిరంకుశ రాజకీయాలు ఉద్ధృతంగా సాగుతున్నాయి. వీటిని ఎదుర్కోవడంలో ఇ.ఎం.ఎస్. కీలకపాత్ర వహించారు. మలయాళంలో పార్టీ పత్రికలతో ఇ.ఎం.ఎస్.కు ప్రగాఢ అనుబంధం ఉంది.కేంద్ర పత్రిక పీపుల్స్ డెమోక్రసీకి సైతం ఆయన సంపాదకుడుగా వ్యవహరించారు. ఇ.ఎం.ఎస్. ఎమర్జెన్సీ కాలంలోనూ ఇందిర నిరంకుశంగా ప్రవేశపెట్టిన రాజ్యాంగ సవరణలకు వ్యతిరేకంగా దేశమంతా పర్యటించి ప్రజలను చైతన్యపరిచారు. ఆంధ్రప్రదేశ్‌లోనూ విస్త్రతంగా పర్యటించారు. ఆంధ్రలోని కమ్యూనిస్టు ఉద్యమంతో ఇ.ఎం.ఎస్.కు ప్రత్యేక అనుబంధం పెంచుకున్నారు.
రాష్ట్రాల హక్కుల కోసం
1977 నుంచి 1992 వరకూ సి.పి.ఎం. ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. జాతీయ రాజకీయాలలో ఆయన మాటకు ప్రత్యేకమైన విలువ ఉంది. మరోసారి 1980లో వామపక్ష ప్రభుత్వం ఏర్పడినా నంబూద్రి ముఖ్యమంత్రి బాధ్యతలు తీసుకోలేదు. ఆ తరవాత కాలంలో ప్రధానంగా ఆయన మతతత్వ రాజకీయాలను అడ్డుకోవడంపై దృష్టిపెట్టి పనిచేశారు. అంతకు ముందు కేరళలోని కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ముస్లింలీగ్ వర్గాలు కూడా ఐక్యసంఘటనలో కలిసి ఉండేవి. 1987 ఎన్నికలకు ముందు నంబూద్రి మతశక్తుల ప్రమేయంలేని ప్రభుత్వ ఏర్పాటును లక్షించారు. అందుకోసం అవిశ్రాంతంగా కృషి చేశారు. అధ్యయనం, ఉద్యమ నిర్మాణంపై ఆయనది ప్రత్యేక దృష్టి. మొదటి నుంచి ఆయన రాష్ట్రాల హక్కుల కోసం పోరాడుతూ వచ్చారు. చివరి దశలో ప్రజాప్రణాళికా విధానాన్ని తీసుకొచ్చారాయన. తద్వారా పాలనా వికేంద్రీకరణకు బాటలు పరచారు.
నంబూద్రిని ప్రేమించని మలయాళీ అంటూ నాకెవరూ కనిపించలేదు అని ప్రసిద్ధ పాత్రికేయుడు ఎ.ఎస్. రామన్ ఒకసారి అన్నారు. ఆయన కేరళ రాజకీయాలలో భీష్మపితామహులు. ఎన్ని ఉన్నత స్థానాలు అలంకరించినా వ్యక్తిగత జీవితంలో మచ్చలేని నిష్కంళక వ్యక్తి. మాట్లాడినా రాసినంత స్పష్టంగా ఉండే ఆయన శైలి అనేక సభల్లో ఆయన ప్రసంగాలను అనువదించిన ఈ వ్యాసకర్తకు సుపరిచితం. చిన్నప్పటినుంచి నత్తి వెంటాడుతున్నా ఖాతరుచేయని దీక్షాదక్షులు. ఆయన నడక సైతం చాలా నెమ్మది. మాటల తూటాలను ఆయన శ్రామికవర్గ ఉద్యమానికి వెలుగు దీపాలుగా ప్రయోగించారు. ఎన్నికల ద్వారా వచ్చిన తొలి కమ్యూనిస్టును తానుకానని, గుయానా అధ్యక్షుడు చెడ్డీ జగన్‌కే ఆ ఘనత దక్కుతుందని స్వయంగా ప్రకటించిన చారిత్రక దృష్టి, వినమ్రత ఆయనది.
ఇ.ఎం.ఎస్. ఆజన్మాంతం నిక్కమైన కమ్యూనిస్టుగానే గడిపారు. అధ్యయనం ఆయన వ్యక్తిత్వానికి కొత్త సొబగులద్దింది. నూతన సామాజికాంశాలను గ్రహించడంలో ఆయనది అందెవేసిన చేయి. సిద్ధాంతాన్ని సృజనాత్మకంగా అన్వయించగల మేధావి ఆయన. పొరబడితే బహిరంగంగా ఆత్మవిమర్శ చేసుకోవడానికీ వెనుకాడరు. ఆయన గొప్ప హాస్యచతురులు కూడా. తొలిసారి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తరవాత లండన్ టైమ్స్ విలేకరి ఆయనను ఇంటర్వ్యూ చేసేందుకు వచ్చారు. మీకు ఎప్పుడూ నత్తి ఉంటుందా అంటూ ఆ విలేకరి అడిగిన ప్రశ్నకు 'లేదు మాట్లాడినప్పుడే' అని ఆయన చమత్కారంగా బదులిచ్చారు. వి.పి.సింగ్ ప్రభుత్వం మరెన్ని రోజులుంటుంది అన్న మరో ప్రశ్నకు ఆ ఊహాగానాలు నా పనికాదు, 'మీ పత్రికల గుత్తసొమ్ము' అంటూ ఠక్కున జవాబు చెప్పారాయన. ఇందిర హయాంలో జాతీయ అభివృద్ధి మండలి సమావేశంలో ఒక సందర్భంలో ఆయన 'థాంక్ గాడ్' అన్నారట. పక్కనే ఉన్న జగ్జీవన్ రాం 'దేవుడిపై మీకు ఎప్పుడు విశ్వాసం ఏర్పడింద'ని అంటే- 'దెయ్యాలను చూసినప్పుడల్లా నాకు దేవుడు గుర్తుకొస్తాడు' అని చమత్కరించారాయన. ఇవన్నీ ఆయన సమయస్ఫూర్తికి నిదర్శనాలు. ఆయన ఆత్మకథకు మలయాళంలో ఉత్తమ సాహిత్య గ్రంథం అవార్డు లభించింది. జీవితం చరమదశలో మలయాళ పత్రిక 'దేశాభిమాని' గౌరవ సంపాదక బాధ్యతలు మరోసారి స్వీకరించి చివరి వరకూ రచనలు చేస్తూనే గడిపారు. అన్ని బాధ్యతలమధ్యా మతిస్థిమితం లేని సతీమణిని శ్రద్ధగా చూసుకున్నారు.
1998 మార్చి 19 తిరువనంతపురంలో తన 89వ ఏట కన్నుమూసిన ఇఎంఎస్‌కు అన్ని పార్టీల నాయకులు నివాళులర్పించడం ఆయన ప్రత్యేకతను తెలుపుతుంది. ఇటీవల వెలువడిన తన జీవిత చరిత్రలో భాజపా నేత అద్వానీ... హోం మంత్రిగా తను చేసిన మొదటి పని నంబూద్రిపాద్‌కు నివాళులర్పించడమేనని రాయడం విశేషం. నంబూద్రి శతజయంతి ఉత్సవాలు జరుగుతున్న ఈ ఏడాది ఆయన సిద్ధాంతాలను స్మరించుకోవడం ఎంతైనా సమంజసం.
Wednesday, April 1, 2009
ఉద్యమాలేమా ఊపిరి - బి.వి.రాఘవులు
దేశంలోనూ, రాష్ట్రంలోనూ కూడా కీలకమైన ఎన్నికల పోరాటం జరుగుతున్నది. ఉన్న అధికారాన్ని ఎలాగై నా నిలబెట్టుకోవాలని కాంగ్రెస్, పోయిన అధికారాన్ని తిరిగి రాబట్టుకోవాలని బిజెపి నానా విన్యాసాలు చేస్తున్నాయి. గత ఐదేళ్లుగా యుపిఎ హానికర విధానాలను తిరస్కరించేందుకు ప్రజలకు లభించిన అవకాశమే ఈ ఎన్నికలు. మరోవైపు పచ్చి మతోన్మాద విధానాలతో మంటలు పెట్టి దేశ లౌకిక సం ప్రదాయాలను నాశనం చేసే ప్రమాదకర శక్తి బిజెపిని తిరస్కరించకపోతే వైవిధ్య భరితమైన ఈ దేశపు అస్తిత్వానికే ముప్పు. అందుకు ఈ రెండు శక్తులనూ తోసిపుచ్చి వివిధ లౌకిక పక్షాలతో కూడిన తృతీయ ప్రత్యామ్నాయ శక్తిని కేంద్రంలో ప్రతిష్టించితేనే దేశ భద్రతకూ ప్రజల ప్రయోజనాలకూ రక్షణ లభిస్తుంది.
ఉగ్రవాదం, మతోన్మాదం దేశ భద్రతకు పెద్ద సవాళ్లుగా తయారైనాయి. ప్రపంచాన్ని ఆవరించి న ఆర్థిక సంక్షోభం తాకిడికి సామాన్య ప్రజలతో పాటు వ్యాపార వర్గాలూ వృత్తి నిపుణులూ కూడా కుదేలవుతున్న పరిస్థితి. యుపిఎ ప్రభుత్వాన్ని బయటనుంచి బలపరిచిన వామపక్షాల ఒత్తిడి, పోరాటాల కారణంగానే దాని ప్రైవేటీకరణ దూకుడుకు కొంతైనా పగ్గాలు పడ్డాయి. ఉపాధి హామీ పథకం, ఆరోగ్య పరిరక్షణ మిషన్, అటవీ హక్కుల చట్టం, నవరత్నాల పరిరక్షణ వంటి చర్యలు సాధ్యమైనాయి. ఈ ప్రత్యామ్నాయ పోరాటమే లేకపోతే దేశం మరింతగా ఆర్థిక సంక్షోభపు తాకిడికి అతలాకుతలమై ఉండేది. అందుకే కాంగ్రెస్, బిజెపిలను నిరోధించి తృతీయ ప్రత్యామ్నాయాన్ని కేంద్రంలో ఏర్పాటు చేసుకోవలసి ఉంది.
మూడు రాష్ట్రాలలో వామపక్ష ప్రభుత్వాలకు నాయకత్వం వహిస్తున్న సిపిఎం తక్కిన వామపక్షాలతో పాటు అలాంటి ప్రత్యామ్నాయానికై ఎంతగానో చొరవచూపుతున్నది. ఎన్‌డిఎ, యుపిఎ కూటములు విచ్ఛిన్నమై భాగస్వాములను కోల్పోతుంటే తృతీయ కూటమిలోకి బలీయమైన ప్రాంతీయ పార్టీలు వచ్చి చేరుతున్నాయి. మొదట ఇది ఆచరణ సాధ్యం కాదన్న వారే ఇప్పుడు దాని అవకాశాలను స్పష్టంగా గుర్తిస్తున్నారు. ముందు ముందు ఇది ఇంకా బలపడడం తథ్యం. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలను చూడాల్సి ఉంది. ఐదేళ్ల కిందట సిపిఎం వామపక్షాలు సాగించిన ప్రజా ఉద్యమాల భూమికపై అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆ లక్ష్యాలను పూర్తిగా వమ్ము చేసింది.
వినాశకరమైన ప్రపంచ బ్యాంకు విధానాలనే మరింత గట్టి గా లోపాయికారిగా అమలు చేసింది. జీవో నెంబర్ 5 వంటి పన్నుల పెంపు, కార్పొరేట్ ప్రధానమైన ఆరోగ్య విధానం, విద్యా రంగంలో పూర్తి వాణిజ్యీకరణ, హద్దూ అదుపులేని బెల్టుషాపులతో మద్య ప్రవాహాలు పారించడం ఇలా ప్రతి విషయంలోనూ ప్రభుత్వం వినాశకర విధానాలనే అనుసరించింది. భూ పంపిణీకి సంబంధించి మేము చేసిన నిర్దిష్ట ప్రతిపాదనలను విస్మరించడమే కాక రకరకాల పేర్లతో ధనస్వాములకు విలువైన యాభైవేల ఎకరాలకు పైగా కట్టబెట్టింది. భూముల మాయాజాలంలో సామాన్య ప్రజలే సమిధలయ్యారు. ప్రజా ప్రభంజనంగా సాగిన భూ పోరాటంపై తూటాల వర్షం కురిపించి ఏడుగురి ప్రాణాలు బలిగొన్నది. మహిళలతో సహా వేలాది ప్రజలపై లాఠీచార్జి చేసి వందల సంఖ్యలో ఆందోళనకారులను జైళ్లలో పెట్టింది. తోటపల్లి, భద్రాచలం, గంగవరం ఇలా నిర్వాసితులు, బాధితులపై తూటాలు కురిపించి రాక్షసత్వం చాటుకున్నది.
ఆఖరుకు ఎరువులు విత్తనాల కోసం వీధుల్లోకి వచ్చిన రైతులపైనా కాల్పులకు పాల్పడింది. 4000మందికిపైగా రైతులు ఆత్మహత్య చేసుకున్నా పట్టించుకోలేదు. వెయ్యిమంది చేతివృత్తిదార్లు ఆత్మహత్య చేసుకున్నా స్పందన లేదు. పాలనా పీఠమైన సచివాలయం ఎదుట ఉన్న లుంబిని పార్కుతో సహా పలుచోట్ల భయానకమైన బాంబు పేలుళ్లు సంభవించినా ఆచూకి పట్టుకున్న దాఖలాలు లేవు. ఆయేషా అమానుష హత్యతో సహా అనేక అఘాయిత్యాలు జరిగినా జవాబుదారీ గా నిలిచిన పాపానపోలేదు. ఆఖరుకు ప్రభుత్వ ఆధ్వర్యంలో జైళ్లలోనే హత్యలు జరిగినా సంజాయిషీ లేదు. ఒక్క ముక్క లో చెప్పాలంటే నేరస్థ శక్తుల ఇష్టారాజ్యం నడుస్తున్నది. ఈ ప్రభుత్వ హయాంలో అవినీతి ఆకాశపుటంచులు దాటింది.
వోక్స్‌వ్యాగన్, డిపెప్, ఎలుగుబంటి.. ఇలా చెప్పా లంటే ప్రతిదీ ఒక కుంభకోణమే. ప్రభుత్వ లాలూచీతో అక్ర మ పద్ధతుల్లో వ్యాపారాలు పెంచుకునే క్రోనీ పెట్టుబడిదారీ విధానానికి రాష్ట్రం అడ్డాగా మారింది. సత్యం మేటాస్ కుంభకోణం ఇందుకు పెద్ద ఉదాహరణ. సాక్షాత్తూ ముఖ్యమంత్రి కుమారుడి సంస్థల్లోకి అనుమానాస్పద పద్ధతుల్లో అనూహ్యమైన మార్గాలలో భారీ పెట్టుబడులు సమకూరిన తీరు సాక్ష్యాధారాలతో సహా బయటకొచ్చింది. దీనిపై చెంపలు వేసుకుని సంజాయిషీ ఇవ్వడానికి బదులు ఎదురుదాడితో పబ్బం గడుపుకోవాలని చూడడం హాస్యాస్పదం. ఐదేళ్లు అధికారంలో ఉన్నవారు ఎవరి విషయంలోనైనా ఏ చర్యయినా తీసుకుని నిజానిజాలు నిగ్గు తేల్చివుండొచ్చు. అంతేగాని తమ పై ఆరోపణలు దారి తప్పించేందుకు మరెవరిపైనో దాడి చేసి ప్రజలను మోసగించలేరు. అలాగే తెలంగాణ సమస్యపై కాంగ్రెస్ రకరకాల మాటలు మార్చి రాజకీయ లబ్ధికోసం పాకులాడి న తీరు సిగ్గుచేటు.
కాంగ్రెస్ తన కుటిల నాటకానికి సిపిఎం వైఖరిని కారణంగా చూపించడం కపటత్వం మాత్రమే. కొత్త శాసనసభ తీర్మానం చేస్తే పార్లమెం టు దానిపై తగు నిర్ణయం తీసుకోవచ్చు. అంతేగాని ఈ సమయంలో తలాతోక లేని రోశయ్య కమిటీ అంటూ రాజకీయ ప్రహసనం నడిపించడం, ప్రజల మనోభావాలతో చెలగాటమాడడం తగని పని. ప్రభుత్వం ఒక్కో ఇంటికి ఎన్నో మేళ్లు చేసిందని ముఖ్యమంత్రి ఊదరగొడుతుంటారు. కాని ఏ రంగంలోనూ ఏ తరగతి వారికి సంబంధించిన మౌలిక విధానపరమైన చర్యలు ప్రభుత్వం తీసుకోలేదు. ప్రజా ఉద్యమాల ఉధృతికి తట్టుకోలేక పరిపాలన సగం గడిచిన తర్వాత ఏవో మొక్కుబడి పథకాలు అమలు చేసింది. అందులోనూ అందినదానికన్నా అవినీతి పాలు చాలా ఎక్కువ.
ఈ విషయాలపై మా పార్టీ వివిధ రంగాల వారీగా 16 పుస్తకాలు ప్రచురించింది. వాటికి ఇంతవరకూ జవాబు ఇవ్వకపోగా గత ఎన్నికల తరుణంలో మేము ప్రచురించిన పుస్తకాలను పట్టుకొని వూరేగుతున్నా రు. అప్పటి ఆ పుస్తకాలపై ప్రజల తీర్పు వచ్చేసింది. వాటిని పట్టుకొని వేళ్లాడితే ఫలితమేమిటి? అంతకంటే విడ్డూరం సిపిఎం ఎన్నికల ప్రణాళికలోని అంశాలే అమలు చేసినట్టు వారి పత్రికలో రాసుకున్నారు. అలా అయితే రోజూ మాపై దాడులెందుకు? ఉక్రోషమెందుకు? శాసనసభనే బేఖాతరు చేసి దుర్భాషలాడటం, కాగ్‌పైనా కోర్టు పైనా కూడా విరుచుకుపడటం ఎలాంటి నిరంకుశత్వం? ఈ వ్యాస పరంపరలో తొలిరోజున ముఖ్యమంత్రి రాసిన వ్యాసంలో వాడిన భాష కూడా అచ్చంగా అలాగే ఉంది. ప్రతిపక్షాలపైనే గాక మీడియాపై కూడా నిరంతరాయంగా దాడి చేయడంలో ఎమర్జె న్సీ నీలినీడలు తొంగి చూడటం ఎంత అప్రజాస్వామికం? ప్రతిచోటా వేలాది కుటుంబాలను నిర్వాసితులను చేయడం, నిరసన అనివార్యమై వారు ప్రతిఘటిస్తే నిర్బంధంతో విరుచుకుపడటం నిత్యకృత్యమైంది.
సిపిఎం కాంగ్రెస్ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టడంలో రాజీలేని పోరాటం చేసింది. ఎల్లవేళలా కష్టజీవుల కోసం సామాన్య ప్రజానీకం కోసం అంకితమైన సిపిఎం ఈ ఐదేళ్లలోనూ ప్రజా సమస్యలను అజెండాలోకి తేవడంలో కీలక పాత్ర వహించింది. వ్యర్థ వివాదాలు, వ్యక్తిగత అంశాల నుంచి విశాల జనబాహుళ్య ఉద్యమాలవైపు నడిపించి సమరశీలతకు మారుపేరుగా అభినందనలు చూరగొన్నది. వైఎస్ ప్రభుత్వ నిర్బంధాన్ని నీచ ప్రచారాలను ఖాతరు చేయకుండా ప్రజాబలంతో ప్రతిఘటన సాగించి ప్రత్యామ్నాయానికి ప్రాతిపదిక వేసింది. కొత్తగా ఏర్పడిన ప్రజారాజ్యం పార్టీ లౌకిక ప్రత్యామ్నాయానికి అనుకూలంగా స్పష్టమైన వైఖరి తీసుకోలేకపోయింది. ఆ పార్టీ లో చేరిన బిజెపి మాజీ కేంద్ర మంత్రి జాతీయ స్థాయిలో బిజెపి గొప్పదని ఇటీవల కీర్తించడమే ఇందుకు నిదర్శ నం. దేశ వ్యాపిత విధానంలో భాగం గా ఇక్కడ సోదర వామపక్షమైన సిపిఐతోనూ, తెలుగుదేశం, తెరాసలతో నూ అవగాహనకు కాంగ్రెస్ వ్యతిరేక ఓట్ల చీలికను నివారించే కృషిచేసింది.
జలయజ్ఞం పేరిట సాగే అవినీతి ని తొలుత స్పష్టంగా ఎత్తిచూపింది సిపిఎం అని అందరికీ తెలుసు. ఇందుకోసం కేసులు నిర్బంధాలు కూడా ఎదుర్కొన్నా వెనుకంజ వేయలేదు. జలయజ్ఞం పేరిట తాడూ బొంగరం లేకుండా ప్రాధాన్య క్రమం లేకుం డా వేల కోట్లు ధారపోయడం కాంట్రాక్టర్ల మేలుకు తప్ప వ్యవసాయం బాగుకు కాదని ఇప్పటికీ సిపిఎం స్పష్టం చేస్తున్నది. వెనకబడిన ప్రాంతాలకు ముందు ప్రాధాన్యత నివ్వా లి. ఉన్న నిధులతో త్వరితంగా అధికంగా ఫలితాలు రాబట్టే క్రమానుగత వ్యూహం అనుసరించాలి. అంతేగాని నాణ్యత, వాస్తవికత పాటించకుండా ఆశ్రిత అవినీతి కాంట్రాక్టర్ల జేబు లు నింపడం క్షమించరాని నేరం. పోలవరం వంటి చోట్ల మరింత అవాస్తవికంగా అనర్థదాయకంగా నిర్మాణం చేపట్టి గిరిజనుల జీవితాలతో చెలగాటమాడడం సహించరానిది. సెజ్‌ల పేరిట భూములు ధారాదత్తం, బాక్సయిట్ నిల్వలను దోచిపెట్టడం ఇవన్నీ కూడా రాష్ట్రానికి ఎంతైనా నష్టదాయకమైన చర్యలు.
అందుకే సిపిఎం స్వయంగానూ ఇతరులతో పాటు వీటిని అడుగడుగునా ప్రతిఘటించి పోరాడింది. ఇప్పుడు ఎన్నికల పోరాటం దాని కొనసాగింపుగానే సిపి ఎం చూస్తుంది. ఇంతటి అవినీతికి అక్రమాలకు కారణమైన కాంగ్రెస్‌ను గద్దె దించకపోతే రాష్ట్రానికి ప్రజలకు రక్షణ ఉండ దు. ఈ ఎన్నికలు రాజకీయ మార్పుకు నాంది పలకాలి. తర్వాత కాలంలోనూ ప్రజల జీవన స్థితిగతులను శాశ్వత ప్రాతిపదికన మెరుగుపర్చి ఉపాధి కల్పించే విధానాలు సా«ధించుకోవాలి. భూమి, ఉపాధి, గృహ వసతి, ఆహారం, ఆరోగ్యం ప్రజలకు కీలక అవసరాలు. ప్రపంచాన్ని ఆవరించి న ఆర్థిక మాంద్యం చాలా కాలం కొనసాగుతున్న దృష్ట్యా దీర్ఘకాలిక పరిష్కార చర్యలు ఆలోచించాలి. ప్రజల కొనుగోలు శక్తి పెంచాలి.
ప్రజాధనాన్ని ప్రభుత్వ ఆస్తులను ఇష్టానుసా రం కొల్లగొట్టడాన్ని అడ్డుకోవాలి. వ్యవసాయానికి ఊపిరిపోయాలి. చేతివృత్తిదార్లకు రక్షణ కావాలి. మహిళలకు భద్రత, భవిత లభించాలి. స్థానిక సంస్థల అధికారాలు, నిధులు పెరగాలి. మితిమీరిన ప్రైవేటీకరణకు స్వస్తి పలకాలి. అన్ని ప్రాం తాల సమతులాభివృద్ధికి అవసరమైన వ్యూహం అనుసరించాలి. యువతకు ఉపాధి కల్పించి ఉత్సాహ పర్చాలి. వివిధ రకాల మత శక్తుల కుట్రలను తిప్పికొట్టి మత సామరస్యాన్ని, లౌకిక తత్వాన్ని కాపాడుకోవాలి. మద్యం విశృంఖలత్వాన్ని అడ్డుకోవాలి. పర్యావరణ కాలుష్యాన్ని నివారించాలి. మాన వ హక్కులు, ప్రజానుకూల పాలనా సంస్కరణలు, పారదర్శక సమాచార హక్కు వంటివి గట్టిగా అమలు చేయాలి. ఆరోగ్యకరమైన సాంస్కృతిక విలువలు పెంపొందించాలి. గిరిజనులకు ప్రత్యేక రక్షణ కల్పించాలి. మైనారిటీల అభ్యున్నతికి దోహదం చేయాలి. సామాజిక న్యాయం అన్నది నిరర్థక నినాదమని సిపిఎం భావించడం లేదు.
గత ఐదేళ్లలోనూ అంతకు ముందు కూడా కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం తరఫున సైకిల్ యాత్రలు, నిరాహార దీక్షలు వగైరా కృషి ఎంతగానో సత్ఫలితాలిచ్చింది. ఎస్‌సి, ఎస్‌టి సబ్‌ప్లాన్ నిధులను నోడల్ ఏజెన్సీకి అప్పగించాలని ఆందోళన చేసి పాక్షికంగా సాధించడం జరిగింది. వాటన్నిటినీ ముందుకు తీసుకుపోవడంలో ప్రస్తుత ఎన్నికల పోరాటం కీలకమైన ఘట్టం. అయితే అది మరో పోరాటానికి నాంది వంటిది మాత్రమే. దేశంలో మొదటి కాంగ్రెసేతర ముఖ్యమంత్రి ఇఎంఎస్ నంబూద్రిపాద్ అన్నట్టు కమ్యూనిస్టుల విషయం లో ఎన్నికలు ద్వితీయమైనవి, ప్రజా ఉద్యమాలే ప్రథమం. ఉద్యమాల ద్వారా సాధించిన ఫలితాలను పురోగమనాన్ని మరింత పటిష్టం చేసుకోవడానికి సాధనంగానే సిపిఎం ఎన్నికలలో పాల్గొంటుంది.
కొంతమంది చౌకబారు విమర్శకులు శాపనార్థాలు పెడుతున్నట్టుగా ఎవరినో ముఖ్యమంత్రిని చేయడానికి లేదా తమకు పదవులు సంపాదించుకోవడానికి కాదు. దేశ ప్రధాని పదవినే వదులుకున్న ఏకైక ప్రజా పార్టీని ఇలాంటి నిందారోపణలు ఏమీ చేయలేవు. దేశంలోనూ రాష్ట్రంలోనూ కూడా కాంగ్రెసేతర లౌకిక ప్రత్యామ్నాయాన్ని తీసుకురావాలనే దాని నిబద్ధ కృషిని అడ్డుకోనూ లేవు. ప్రజాస్వామిక లౌకిక సంప్రదాయాలకు పెట్టింది పేరైన తెలుగు ప్రజలు ఈ ఎన్నికల్లో సరైన తీర్పు నిచ్చి కాంగ్రెస్ అవినీతి పాలనను అంతం చేస్తారని మా దృఢ విశ్వాసం. అలాగే మా పార్టీ ప్రాతినిధ్యం పెంచుకుని ప్రజల పక్షాన నిలబడతాం.
(వ్యాసకర్త సిపిఎం రాష్ట్ర కార్యదర్శి)