- ఆర్థిక దిగ్బంధనాన్ని తొలగించాలి
- 'ప్రజాశక్తి' ఇంటర్వ్యూలో సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు నూరుల్ హుడా
'గ్రేటర్ నాగాలాండ్' అనే డిమాండ్ ఎందుకు వచ్చిందంటారు?
దీని గురించి తెలుసుకోవాలంటే స్వాతంత్య్ర పూర్వం జరిగిన సంఘటనల గురించి మనం తెలుసుకోవాలి. 1947 కంటే ముందు నాగాలాండ్ భారత్‌దేశంలో భాగంగా లేదు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాతనే నాగాలాండ్‌ను భారత్‌లో విలీనం చేశారు. ఆ దశలో ఇషాక్ ఛూ, టిహెచ్ మ్యూవా అనే ఇద్దరు నాయకులు నేషనల్ సోషలిస్టు కౌన్సిల్ ఆఫ్ నాగాలాండ్ (ఎన్‌ఎస్‌సిఎన్) అనే సంస్థను నెలకొల్పి విలీనానికి వ్యతిరేకంగా పోరాడారు. ఇది నెహ్రూకాలం నాటి సంగతి. అయితే వారిద్దరు కొద్దికాలం తర్వాత భారత్‌ను వదిలి విదేశాలకు వెళ్లిపోయారు. భారత్‌లో నాగాలాండ్ ఒక రాష్ట్రంగా కలిసిపోయిన తర్వాత ప్రత్యేక దేశంగా ఏర్పాటు చేయటం అసంభవమని వారు గుర్తించారు. అందువల్ల ఇప్పుడు 'నాగానీస్' భాష మాట్లాడేవారందూ ఒకే రాష్ట్రంగా ఉండాలనేది వారి డిమాండ్. నాగాలాండ్‌లోని కొన్ని జిల్లాలతోపాటు మణిపూర్‌లో 'నాగానీస్' భాష మాట్లాడే ప్రాంతాలన్నింటినీ కలిపి 'గ్రేటర్ నాగాలాండ'్ ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. దీన్ని మణిపూర్‌లోని అత్యధికులతోపాటు స్వల్ప సంఖ్యలో అక్కడున్న అస్సామీలు, బెంగాలీలు, హిందీ మాట్లాడేవారు, అరుణాచల్ ప్రదేశ్‌కు చెందిన వారు వ్యతిరేకిస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఇరు రాష్ట్రాల్లోనూ పలుమార్లు ఆందోళనలు జరిగాయి కదా? వివరిస్తారా?
అవును. గ్రేటర్ నాగాలాండ్ కోసం 10 సంవత్సరాల నుండి ఆందోళనలు జరుగుతున్నాయి. 2001లో ఈ డిమాండ్‌ను వ్యతిరేకిస్తూ మణిపూర్ రాజధాని ఇంఫాల్‌లో యువతీ యువకులు పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు, ఆందోళనలు చేశారు. ఈ సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. పోలీసులు కాల్పులు జరిపారు. 18 మంది చనిపోయారు. ఈ యేడాది (2010) ఏప్రిల్‌లో 'గ్రేటర్ నాగాలాండ్'ను డిమాండ్ చేస్తూ 'నాగాలాండ్ స్టూడెంట్ ఫెడరేషన్', 'ఆల్ మణిపూర్ నాగా స్టూడెంట్స్ అసోసియేషన్స్' ఆధ్వర్యాన మణిపూర్‌కు ఎలాంటి నిత్యావసరాలు, వస్తువులు వెళ్లనీయకుండా ఆర్థిక దిగ్భంధనం చేపట్టారు. అప్పటి నుంచి ఇప్పటివరకూ ఈ పరిస్థితి ఇలాగే కొనసాగుతోంది. ఇదే సమయంలో విదేశాల్లో ఉన్న ఎన్‌ఎస్‌సిఎన్ నాయకుడు మ్యూవా మణిపూర్‌లో స్వగ్రామానికి పర్యటిస్తానంటూ ప్రకటించారు. మరోవైపు ప్రస్తుత పరిస్థితుల్లో మ్యూవా పర్యటనను అంగీకరించలేమంటూ మణిపూర్ ముఖ్యమంత్రి ఓఇబోబి ప్రకటిం చారు. ఆయన రాష్ట్ర సరిహద్దుల్లోకి వస్తే అరెస్టు చేయాలంటూ పోలీసుల్ని ఆదేశిం చారు. నాగా స్టూడెంట్స్ మ్యూవాకు మద్దతు పలికారు. ఈ ఉద్రిక్త పరిస్థితుల్లోనే మ్యూవా మణిపూర్ సరిహద్దుల్లోకి ప్రవేశించటం, సరిహద్దుల్లో నాగా స్టూడెంట్ల ఆందోళన, పోలీసుల కాల్పులు, ఇద్దరు నాగా విద్యార్థులు మరణించటం తదితర సంఘటలన్నీ వెంటవెంటనే జరిగిపోయాయి. పర్యవసానంగా ఇప్పుడు మరింత భయానక పరిస్థితులేర్పడ్డాయి.
ఆర్థిక దిగ్భంధనం నేపథ్యంలో మణిపూర్ ప్రజల పరిస్థితులెలా ఉన్నాయి?
వారి పరిస్థితి భయానకంగా ఉంది. ఎన్‌హెచ్-39, ఎన్‌హెచ్-53 ద్వారా మణిపూర్‌కు నిత్యావసరాలు, సరుకు రవాణా జరుగుతుంది. ఎన్‌హెచ్-39 గౌహతి, నాగాలాండ్ మీదుగా మణిపూర్ వరకు ఉంది. ఎన్‌హెచ్-53 గౌహతి, షిల్‌షేర్ (అస్సాం) మీదుగా ఇంఫాల్ (మణిపూర్ రాజధాని) వరకు ఉంటుంది. ఈ రెండింటినీ ఇప్పుడు దిగ్భంధించారు. ఫలితంగా నిత్యావసరాల ధరలు చుక్కలనంటాయి. బ్లాక్ మార్కెట్ రాజ్యమేలుతోంది. నేను జూలైలో స్వయంగా ఆ రాష్ట్రాన్ని సందర్శించాను. అప్పుడు లీటర్ పెట్రోల్ ధర రూ.70 నుండి 80 వరకూ ఉంది. కిరోసిన్ ధర లీటర్‌కు రూ.80 వరకూ ఉంది. దీని వల్ల రవాణా చార్జీలు, ఫలితంగా నిత్యావసరాల ధరలు విపరీతంగా పెరిగాయి. అసలే వెనుకబడిన రాష్ట్రమైన మణిపూర్ ఆర్థికస్థితి ప్రస్తుత పరిస్థితి వల్ల మరింత దిగజారింది.
సమస్య పరిష్కారానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలేమిటి?
సమస్యను పరిష్కరించి ప్రజలకు స్వాంతన చేకూర్చాల్సిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చోద్యం చూస్తున్నాయి. పరిష్కారం కనుగొనటంలో అవి రెండూ పూర్తిగా విఫలమయ్యాయి. నేను జూలైలో కేంద్ర హోంమంత్రి చిదంబరాన్ని స్వయంగా కలిసి పరిస్థితి వివరించాను. ఆర్థిక దిగ్భంధనాన్ని తొలగించి ప్రజల్ని రక్షిస్తామన్న ఆయన తన వాగ్ధానాన్ని ఇప్పటికీ నెరవేర్చలేకపోయారు. అవతల రెండు రాష్ట్రాల మధ్య భీతావాహ వాతావరణం రాజ్యమేలుతోంటే ఎలాంటి చర్యలు చేపట్టకుండా హోం మంత్రి నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించటం శోచనీయం. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం కూడా సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవటంలో ఘోరంగా విఫలమైంది.
మణిపూర్-నాగాలాండ్ సమస్యకు సిపిఎంగా మీరెలాంటి పరిష్కారాన్ని చూపిస్తున్నారు?
కేంద్రం చొరవ తీసుకోవటం ద్వారానే సమస్య పరిష్కారమవుతుంది. ఇది తప్ప వేరే మార్గం లేదు. మణిపూర్-నాగాలాండ్‌కు చెందిన వివిధ పార్టీల నాయకుల్ని, ప్రజా, స్వచ్ఛంద సంఘాల్ని ఢిల్లీకి పిలిపించుకుని చర్చలు జరపాలి. తద్వారా సామరస్యపూర్వకంగా పరిష్కారం కనుగొనాలి. దీనికంటే ముందుగా ఆర్థిక దిగ్భంధనాన్ని తొలగించి మణిపూర్ ప్రజల్ని రక్షించాలని మేం డిమాండ్ చేస్తున్నాం.
No comments:
Post a Comment