- స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలను చర్చకు పెట్టాలి : వరదరాజన్ డిమాండ్
స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు ఎందుకు ముందుకొచ్చాయి?
అభివృద్ధి చెందుతున్న దేశాల్లోకి తమ మార్కెట్‌ను విస్తరించడానికి అమెరికాతో సహా సామ్రాజ్యవాద దేశాలు ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యుటిఒ)ను ప్రారంభించాయి. డబ్ల్యుటిఒ ఒప్పందాలపై దోహాలో జరిగిన చర్చల్లో ఆ దేశాలకు ఎదురుదెబ్బ తగిలింది. వ్యవసాయానికి అభివృద్ధి చెందిన దేశాల్లో సబ్సిడీలకు కోత పెట్టాలంటున్న అమెరికా, యూరప్ దేశాలు తాము మాత్రం కుప్పలు తెప్పలుగా సబ్సిడీలిస్తున్నాయి. ఈ విషయంపైనే ప్రధానంగా దోహా చర్చలు విఫలమయ్యాయి. దీంతో అభివృద్ధి చెందిన దేశాల కబళించేందుకు స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలను సామ్రాజ్యవాద దేశాలు ముందుకు తెచ్చాయి.
భారత ప్రభుత్వం ఏ వైఖరి తీసుకుంది?
అమెరికాకు సాగిల పడుతున్న భారత ప్రభుత్వం తమ ప్రజలకు నష్టం కలుగు తున్నప్పటికీ వాణిజ్య ఒప్పందా లను కుదు ర్చుకుంటోంది. మన్మోహన్‌సింగ్ సర్కార్ ఈ కాలంలో 59 ఒప్పందాలను కుదుర్చుకుంది. అన్ని ఒప్పం దాలూ దేశ ప్రజలకు హానికరం. విదేశీ వస్తువుల దిగుమతులపై పన్నులు అంతకంతకూ తగ్గిస్తూ, మన వస్తువుల ఎగుమతులపై పన్నులు పెంచుతోంది. దీనివల్ల రైతులు, చిన్న చిన్న ఉత్పత్తిదారులు కోట్లాది రూపాయలు నష్టపోతున్నారు. వారి మనుగడ ప్రమాదంలో పడింది. మరోపక్క ఈ ఒప్పందాల వల్ల స్వదేశీ, విదేశీ బహుళజాతి సంస్థలు విపరీతంగా లాభపడుతున్నాయి.
ఆసియా ఒప్పందం ప్రభావం ఏ విధంగా ఉంది?
ఆసియా ఒప్పందం వల్ల కేరళ రైతాంగం వేల కోట్ల రూపాయలు నష్టపోయింది. అంతేకాకుండా భారత కోస్తా తీర రాష్ట్రాల్లోని వివిధ వర్గాల ప్రజలపై, వృత్తిదారులపై ప్రతికూల ప్రభావం చూపింది. ఒప్పందాలవల్ల గ్రామీణ ప్రాంత ప్రజలపై నేరుగా దాడి జరుగుతోంది. దేశంలోని 9 కోట్ల పాల ఉత్పత్తిదారులు నష్ట పోతున్నారు. పాడి పశువుల పెంపకంపై ఆధారపడి జీవనం సాగిస్తున్న గ్రామీణ మహిళలు నష్టాల పాలవుతున్నారు. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల్లోని 'స్వేచ్ఛ' ప్రజలకు ఎంతమాత్రం కాదు. బహుళజాతి సంస్థలకు, సామ్రాజ్యవాద దేశాలకే ఆ 'స్వేచ్ఛ'.
ఇండో-యూరోపియన్ అగ్రిమెంట్ పర్యవసానాలేమిటి?
ఇండోయూరోపియన్ ఒప్పందం వల్ల వ్యవసాయా ధారిత 48 వస్తువుల దిగుమ తులపై ఆంక్షలు ఎత్తివేస్తారు. దీనివల్ల రైతుల పరిస్థితి మరింత దుర్భరంగా మారుతుంది.
ఒప్పందాల విషయంలో ఎఐకెఎస్ ఏం చెబుతోంది?
రాజ్యాంగం రీత్యా వ్యవసాయం రాష్ట్రాల పరిధిలో ఉంది. ట్రేడ్ అగ్రిమెంట్లు కుదుర్చుకోడానికి ముందు వాటిని పార్లమెంట్‌లో సమగ్ర చర్చకు పెట్టాలని డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్రాలతో కనీసం సంప్రదింపులు జరపకుండా కేంద్రమే ఫెడరల్ స్ఫూర్తికి విఘాతం కలిగిస్తోంది. అన్ని అగ్రిమెంట్లపైనా రాష్ట్రాల నుండి అభిప్రాయాలు సేకరించాలి. ఇప్పటి వరకూ కుదుర్చుకున్న అన్ని ఒప్పందాలనూ ప్రభుత్వం రహస్యంగా ఉంచింది.
ఒప్పందాలకు వ్యతిరేకంగా ఎఐకెఎస్ కార్యాచరణ ఏమిటి?
వ్యవసాయానికి హాని కలిగించే అగ్రిమెంట్లకు వ్యతిరేకంగా ఎఐకెఎస్ పోరాడుతోంది. కలిసొచ్చే శక్తులను కలుపుకొని విశాల ప్రాతిపదికపై ఆందోళనలకు ప్రయత్నిస్తోంది. దేశ స్థాయిలో రైతులను సమీకరిస్తోంది. ఒప్పందాలపై విస్తృత ప్రచారం నిర్వహిస్తోంది. అఖిల భారత స్థాయిలో ఢిల్లీలో నిర్వహించిన సెమినార్‌కు కాంగ్రెస్‌తో పెనవేసుకు పోయిన రైతు నాయకులు కూడా హాజరయ్యారు. ఎఐకెఎస్ చెబుతున్నట్లు స్వేచ్ఛా ఒప్పందాల వల్ల వ్యవసాయానికి నష్టం జరుగుతుందని వారు అంగీకరించారు. పోరాటాల్లోకి కలిసొస్తామని, సహకరిస్తామని చెప్పారు.
రైతుల ఆత్మహత్యలకు కారణాలేంటి?
దేశంలో మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోనే అధికంగా రైతు ఆత్మహత్యలు జరుగుతున్నాయి. వ్యవసాయ ఉత్పాదకాల ధరలు విపరీతంగా పెరగడం, రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించే విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకోకపోవడం, ప్రభుత్వ బడ్జెట్‌లో ఆ రంగానికి కేటాయింపులు అంతకంతకూ తగ్గడం, సంస్థాగత రుణాలు అందక, ప్రైవేట్ వడ్డీ వ్యాపారులను ఆశ్రయించడం వల్ల రైతులు దిక్కుతోచని స్థితిలో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో విత్తన మార్కెట్ ప్రైవేట్‌పరం అయిపోయింది. ప్రభుత్వం ఆ రంగం నుండి తప్పుకుంది. మోన్‌శాంటో వంటి బహుళజాతి కంపెనీలపై ప్రభుత్వ నియంత్రణ లేదు. తమ విత్తనాలు విఫలమయ్యాయని మోన్‌శాంటో ఒప్పుకున్నా ఆ విత్తనాల అమ్మకాలు యధేచ్ఛగా జరుగుతున్నాయి. ఆత్మహత్యలు సమస్యలకు పరిష్కారం కాదు. ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా రైతులు పోరాటాల్లోకి రావాలి.
No comments:
Post a Comment