'సుత్తీ కొడవలి చుక్కా...ఇది పేదల పాలిటి వేగుచుక్కా', 'కనుమూసిన వీరుల్లారా...విప్లవ ధ్రువ తారాల్లారా', 'అమర వీరులకు, జాతి యోధులకు పూలాతో పూజించుదుమా..' అంటూ ప్రజా నాట్య మండలి కళాకారులు గళమెత్తి పాడుతుండగా, 'వర్థిల్లాల్లి మార్క్సిజం- లెనినిజం', 'వర్థిల్లాలి సోషలిజం', 'నశించాలి సామ్రాజ్యవాదం', 'సాధిస్తాం అమరవీరుల ఆశయాలను - సాధిస్తాం, సాధిస్తాం' అని కార్యకర్తలు నినాదాల చేస్తుండగా.. ఎన్నో కమ్యూనిస్టు ఉద్యమ చారిత్రాత్మక ఘట్టాలకు సాక్షీభూతంగా నిలిచిన విజయవాడ (తుమ్మలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రం-షాహిద్‌నగర్)లో శనివారం సిపిఎం అఖిల భారత విస్తృత సమావేశాలు ఉత్సాహపూరిత వాతావరణంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యులు, వివిధ రాష్ట్రాల నుండి వచ్చిన పోరాట యోధులు వందలాది మంది జెండా చుట్టూ మూడు వరుసల్లో నిలబడి రెడ్‌శాల్యూట్ చేస్తుండగా వీర తెలంగాణా సాయుధ పోరాట యోధులు, సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు మల్లు స్వరాజ్యం అరుణపతాకాన్ని ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా 'దున్నేవానికే భూమి పంచాలి, వర్థిల్లాలి ప్రజాపోరాటాలు, అప్‌అప్ సోషలిజం, డౌన్ డౌన్ బ్లడీ క్యా పటలిజం, జిందాబాద్ సిపిఎం, ప్రాణాలొడ్డి పోరాడుతాం, సామ్రాజ్యవాదాన్ని ఎదిరిస్తాం' నినదాలతో అక్కడి వాతావరణం మారుమోగింది. ఆ తర్వాత పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రకాశ్ కరత్, పొలిట్‌బ్యూరో సభ్యులు, ప్రతినిధులు అమరవీరుల స్థూపం వద్దకు వరుసగా వెళ్లి ఘన నివాళులర్పించారు.
పాంథే ఛైర్మన్‌గా అధ్యక్షవర్గం
నాలుగురోజుల పాటు జరిగే విస్తృత సమావేశాల కోసం పొలిట్‌బ్యూరో సభ్యులు ఎంకె పాంథే ఛైర్మన్‌గా అధ్యక్షవర్గాన్ని ఎన్నుకున్నారు. పాంథేతో పాటు వినరుకోనార్(బెంగాల్), ఎంఎ బేబి(కేరళ), ఎంఎ గఫూర్ (ఆంధ్రప్రదేశ్), రమాదాస్ (త్రిపుర) అధ్యక్షవర్గానికి ఎన్నికయ్యారు. పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రకాష్ కరత్ అధ్యక్షవర్గాన్ని ప్రతిపాదించగా, పొలిట్‌బ్యూరో సభ్యులు బిమన్‌బసు బలపరిచారు.
కన్నుల పండువ చేసిన సమావేశాల ప్రాంగణం
విస్తృత సమావేశాల సందర్భంగా షాహిద్ నగర్ (తుమ్మలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రం) ప్రాంగణంలో ఉంచిన అమరులైన మార్క్సిస్టు యోధుల ఫోటోలు, వివిధ నినాదాలతో కూడిన కటౌట్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఆడిటోరియానికి పై భాగాన మార్క్స్, లెనిన్, స్టాలిన్, ఏంగిల్స్ చిత్రపటాలు సమాజానికి దిశానిర్దేశం చేసే విధంగా ఉన్నాయి. ఆడిటోరియానికి ముందు భాగాన ఒకవైపు జ్యోతిబసు, మరోవైపు హరికిషన్‌సింగ్ సూర్జిత్ ఫోటోలు, ఆ పక్కనే అమరవీరులకు సూచికగా ఒక యోధుడి చేతిలో ఎర్రని జెండాను ఉంచారు. ఈ దృశ్యాలు ఆడిటోరియం వెలుపల నుండి చూసే వీక్షకులకు కన్నుల పండుగ చేశాయి. పతాకావిష్కరణ వేదిక చుట్టూ అమర్చిన సుందరయ్య, ప్రమోద్‌దాస్‌గుప్తా, పి.రామస్వామి, ఎకె గోపాలన్, బిటి రణదీవె, ఇఎంఎస్ నంబూద్రిపాద్, హరికిషన్‌సింగ్ సూర్జిత్, జ్యోతిబసు, మాకినేని బసవపున్నయ్య చిత్రపటాలు సమావేశాలకు దిశానిర్దేశం చేసే విధంగా ఉన్నాయి. ఆడిటోరియం ప్రధాన ద్వారం వద్ద అమర్చిన 'ప్రజల కోసం-దేశం కోసం సిపిఎం' అనే బ్యానర్ సమావేశాలకు విచ్చేసిన ప్రతినిధులు, కార్యకర్తలకు స్ఫూర్తినిచ్చేదిగా ఉంది. సమావేశాలకు విచ్చేసిన ప్రతినిధులకు తెల్లని యూనిఫాం ధరించిన బాలురు, ఎర్రని చీరలు ధరించిన బాలికలు సాదరంగా ఆహ్వానం పలికారు.
సిపిఎం ఆఖిల భారత విస్తృత సమావేశాలు - ఆగస్ట్ 7నుండి 12వరకు విజయవాడలో...
సిపిఎం ఆఖిల భారత విస్తృత సమావేశాలు - ఆగస్ట్ 7నుండి 10వరకు విజయవాడలో...
సిపిఎం అఖిల భారత విస్తృత సమావేశాలు విజయవాడలో ఉత్సాహపూరితంగా ఉత్తేజభరితంగా శనివారం ప్రారంభ మయ్యాయి. ఈ సమావేశాలకు దేశం నలుమూలల నుండి విచ్చేసిన కమ్యూనిస్ట్ నాయకులకు, సమావేశ సంరంభాలను వీక్షించేందుకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలనుండి తరలివచ్చిన కమ్యూనిస్టు యోధులు, యువ కమ్యూనిస్టులు, మహిళా నేతలు, శ్రేయోభిలాషులకు విప్లవాభివందనాలు...
No comments:
Post a Comment