- కాంగ్రేసేతర లౌకిక పక్షాల సమీకరణ
- బెంగాల్ వామపక్షానికి దేశవ్యాప్త మద్దతు
- స్వతంత్ర కార్యాచరణతో పార్టీ బలోపేతం
- సిపిఎం ముసాయిదా రాజకీయ తీర్మానం
పార్టీ ముసాయిదా రాజకీయ తీర్మానంలోని ముఖ్యాంశాలివీ...
తాజా రాజకీయ పరిస్థితి
కాంగ్రెస్ : పార్టీ 19వ మహాసభ అనంతరకాలంలో కాంగ్రెస్ బలం పుంజుకుంది. కాంగ్రెస్ నేతృత్వంలోని యుపిఎ లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించినప్పటికీ, మెజార్టీని సాధించలేకపోయింది. ఇతర అనేక పార్టీల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగింది. దేశంలోని అత్యంత బలమైన బడా పెట్టుబడిదారులందరి మద్దతూ కాంగ్రెస్‌కు లభించింది. బిజెపి తిరిగి అధికారంలోకి రాకూడదని ఎక్కువమంది ప్రజలు భావించడం కూడా కాంగ్రెస్‌కు లబ్ధి చేకూర్చింది. మధ్యతరగతి, మైనార్టీలు, యువత నుండి ఆ పార్టీకి ఎక్కువ మద్దతు లభించింది. గత రెండు దశాబ్దాలుగా బలహీనపడిన యుపి, బీహార్ వంటి రాష్ట్రాల్లో తిరిగి పునరుజ్జీవం పొందేందుకు పార్టీ ప్రయత్నిస్తోంది. పార్లమెంటులో తమ ఎజెండా సజావుగా సాగడానికి, యుపిఎ బయట ఉన్న పార్టీల మద్దతు కూడా అవసరమని అధికారంలోకి వచ్చిన ఏడాది తర్వాత కాంగ్రెస్ గుర్తించింది. ఈ నేపథ్యంలో ఎస్‌పి, ఆర్‌జెడి, బిఎస్పీ, జెడి(ఎస్) తదితర పార్టీల నుండి అంశాల వారీగా మద్దతు కూడగట్టేందుకు బేరసారాలు చేపడుతోంది. లోక్‌సభలో అతితక్కువ మెజార్టీ ఉన్న స్థితిలో, అమెరికా ఆదేశిత ద్రవ్య పెట్టుబడి సంస్కరణలను ముందుకు తీసుకెళ్లేందుకు ఈ పార్టీలతో లాలూచీ పడేందుకు సిద్ధపడుతోంది. ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు డిఎంకె, తృణమూల్ కాంగ్రెస్‌ల డిమాండ్లకు తలొగ్గుతోంది. ఈ నేపథ్యంలోనే మావోయిస్టులతో తృణమూల్ కాంగ్రెస్ కుమ్మక్కైనప్పటికీ చూసీచూడనట్లు వ్యవహరిస్తోంది.బిజెపి - మిత్రపక్షాలు : లోక్‌సభ ఎన్నికల ఫలితాల అనంతరం బిజెపిలో ఏర్పడ్డ గందరగోళం, ఆర్‌ఎస్‌ఎస్ జోక్యంతో ముగిసింది. నూతన నాయకత్వం ఏర్పడింది. స్థూలంగా అనేక ఎదురుదెబ్బలు తగిలినప్పటికీ, గుజరాత్, కర్ణాటక, మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్‌ఘడ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ తదితర రాష్ట్రాల్లో ఆ పార్టీ పునాది స్థిరంగా ఉంది. మతోన్మాద ఎజెండాను ముందుకు తీసుకెళ్లే అంశాలపై ఆ పార్టీ కేంద్రీకరించనుంది. పార్టీలోనే గందరగోళ పరిస్థితులు నెలకొనడంతో మిత్రపక్షాలను ఒక్కదగ్గర నిలపడంలో బిజెపి విఫలమయ్యింది. అస్సాంలో బిజెపి కూటమి నుండి ఎజిపి బయటకు వెళ్లింది. బీహార్‌లో జెడి(యు)తో ఆ పార్టీ సంబంధాలు సజావుగా లేవు.
ప్రాంతీయ పార్టీల వైఖరి : ప్రాంతీయ పార్టీలు స్థూలంగా ప్రాంతీయ పెట్టుబడిదారులు, గ్రామీణ ధనికుల ప్రయోజనాలకు ప్రాతినిథ్యం వహిస్తు న్నాయి. సంకీర్ణ రాజకీయాల నేపథ్యంలో ఆయా రాష్ట్రాల్లో ప్రభుత్వాలను ఏర్పాటు చేయాలనీ, కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామలుగా ఉండాలని ఈ పార్టీలు భావిస్తున్నాయి. ఈ పార్టీలన్నీ బిజెపి పట్ల తమ వైఖరిలో అవకాశవాదంతో వ్యవహరిస్తున్నాయి. తమ ప్రయోజనాలను నెరవేరుతాయని భావించినప్పుడు, లౌకికతత్వాన్ని పక్కనపెట్టి బిజెపితో చేతులు కలపడానికి సిద్ధపడుతున్నాయి. ప్రస్తుత సరళీకరణ యుగంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాత్రమే ప్రాంతీయ పార్టీలు నూతన ఆర్థిక విధానాలను వ్యతిరేకిస్తున్నాయి. ఈ పార్టీల మద్దతు కూడగట్టేందుకు కాంగ్రెస్ నేతృత్వంలోని యుపిఎ, బిజెపి నేతృత్వంలోని ఎన్‌డిఎ నిరంతరం ప్రయత్నిస్తున్నాయి. దేశంలో రెండు పార్టీల వ్యవస్థ స్థిరపడటం వామపక్షాలకు మేలు చేయదు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్, బిజెపిలతో లేని ప్రాంతీయ పార్టీల సహాయ సహకారాలు కూడగట్టడం కోసం మనం ప్రయత్నించాలి. కేంద్ర-రాష్ట్ర సంబంధాలు, ఇతర ప్రజా సమస్యలపై ఉమ్మడి పోరాటాలకు ఇటువంటి సహకారం సాధ్యమౌతుంది. తమ తాత్కాలిక ప్రయోజనాల కోసం ఈ పార్టీలు ఇటీవలి కాలంలో కాంగ్రెస్‌తో లాలూచీ పడటం తెలిసిందే.
ఐనప్పటికీ ప్రజా సమస్యలపై ఈ పార్టీలతో సహకారం, సమన్వయం కోసం మన ప్రయత్నాలు కొనసాగాలి. ఈ ఏడాది ఏప్రిల్ 27న ధరలకు వ్యతిరేకంగా 13 కాంగ్రెస్, బిజెపియేతర పార్టీలు హర్తాళ్‌కు పిలుపునివ్వడం, జులై ఐదున 12 పార్టీలు ఇదే అంశంపై రెండోసారి పిలుపునివ్వడం ఇటువంటి అవకాశాన్ని స్పష్టం చేస్తున్నాయి. లోక్‌సభలో కోత తీర్మానం సందర్భంగా ఆర్‌జెడి, ఎస్‌పి వెనకడుగు వేయడం ఆ పార్టీల నిలకడలేనితనాన్ని తెలియజేస్తుంది. సిపిఎంపై దాడి జరుగుతోన్న సమయంలో, వామపక్షాలను ఒంటిరిచేసే ప్రయత్నాలు సాగుతోన్న స్థితిలో ప్రాంతీయ పార్టీలతో ఉమ్మడి కార్యాచరణ కోసం ప్రయత్నాలు కొనసాగించడం అవసరం. ఉమ్మడి విధానాలు లేదా ఉమ్మడి వేదిక ఆధారంగా తృతీయ ప్రత్యామ్నాయ ఆవిర్భా వానికి సమయం పడుతుంది. ప్రాంతీయ పార్టీలలో కొన్నింటితోనైనా ఎన్నికల అవగాహనలు కుదుర్చుకోవడం మాత్రం సాధ్యపడుతుంది. అది అవసరం కూడా.
తెలంగాణా - ప్రత్యేక రాష్ట్రాలు
భాషా ప్రయుక్త రాష్ట్రాలను చిన్న రాష్ట్రాలుగా విభజించడం వల్ల దేశ సమాఖ్య వ్యవస్థకు హాని జరుగుతోంది. వెనుకబడిన ప్రాంతాల సామాజిక-ఆర్థిక అభివృద్ధి కోసం ప్రత్యేక చర్యలు చేపట్టాలి. 2009 డిసెంబర్‌లో టిఆర్‌ఎస్ అధ్యక్షుడు కెసిఆర్ ఆమరణ నిరాహారదీక్ష చేపట్టిన నేపథ్యంలో కేంద్రం ప్రత్యేక రాష్ట్ర డిమాండ్‌కు అంగీకరించింది. దీంతో ప్రత్యేక తెలంగాణా ఉద్యమానికి ఊతం లభించింది. ప్రతిగా సమైక్యాంధ్ర ఉద్యమం ముందుకు రావడంతో, కేంద్రం వెనకడుగు వేసి చర్చల కోసం ఒక కమిటీని ఏర్పాటు చేసింది. కేంద్రం తొందరపాటు చర్య వల్ల దేశంలోని అనేక ప్రాంతాల్లో ప్రత్యేక రాష్ట్ర డిమాండ్లు మళ్లీ ముందుకొచ్చాయి. ఈ విషయంపై సిపిఎం స్థిరమైన వైఖరి తీసుకుంది. ఉధృత ప్రజా ఉద్యమాల నేపథ్యంలో ఏర్పడిన భాషా ప్రయుక్త రాష్ట్రాల విభజనకు పార్టీ వ్యతిరేకం. భాషా ప్రయుక్త రాష్ట్రాలను విభజించి చిన్న రాష్ట్రాలను ఏర్పాటు చేయడం దేశ సమాఖ్య వ్యవస్థకు హానికరం. ఈ రాష్ట్రాలు మరింతగా కేంద్రంపై ఆధారపడే పరిస్థితి ఏర్పడుతుంది. బడా కార్పొరేట్ కంపెనీలు, బహుళ జాతి సంస్థలు సులభంగా దోపిడీ చేయడానికి చిన్న రాష్ట్రాలు అవకాశం కల్పిస్తాయి. ఏదైనా రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతాలు ఉంటే, ప్రత్యేక చర్యల ద్వారా ఆ ప్రాంతాల సామాజిక-ఆర్థిక అభివృద్ధికి కృషి చేయాలి. అవసరమనుకుంటే అటువంటి ప్రాంతాలకు ప్రాంతీయ ప్రతిపత్తి కల్పించే అవకాశం కూడా ఉంది.
సిపిఐ(ఎం) : ప్రతికూల స్థితిని అధిగమించాలి
లోక్‌సభ ఎన్నికల్లో ఓటమి తర్వాత, పార్టీ ప్రతికూల పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఎన్నికల్లో ఎదురుదెబ్బలు తగిలిన బెంగాల్ రాష్ట్రంలో పార్టీపై దాడి జరుగుతోంది. కేరళలో ఎన్నికల అనంతరం కాంగ్రెస్ నేతృత్వంలోని యుడిఎఫ్ మతోన్మాద, ప్రతీఘాత శక్తులను తన వెనుక సంఘటితం చేసేందుకు ప్రయత్నిస్తోంది. త్రిపురలో మాత్రమే పార్టీ తన బలాన్ని పెంచుకుంటోంది. సంఘటితం చేసుకుంటోంది. లోక్‌సభ ఎన్నికల అనంతరం జరిగిన పంచాయతీ, గిరిజన మండళ్ల ఎన్నికల్లోనూ పార్టీ విజయం సాధించింది. '19వ మహాసభ నిర్మాణ కర్తవ్యాల మధ్యంతర సమీక్ష'లో పేర్కొన్న విధంగా ఇతర రాష్ట్రాల్లో పెద్దగా పురోగతి లేదు. తక్షణ కర్తవ్యాలను రూపొందించేప్పుడు ఈ అంశాన్నీ పరిగణనలోకి తీసుకోవాలి. లోక్‌సభ ఎన్నికల అనంతరం మావోయిస్టుల అండతో బెంగాల్లో పార్టీపై తృణమూల్ ఎదురుదాడి చేస్తోంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలపై కేంద్రీకరించి పార్టీ నేతలు, కార్యకర్తలు, సానుభూతిపరులను హతమారుస్తోంది. ప్రజలను సమీకరించడం ద్వారానే పార్టీ ఈ దాడులను ఎదుర్కోవాలి.
అదేసమయంలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని కార్మికవర్గ డిమాండ్లపై పార్టీ ఉద్యమాలు చేపడుతోంది. ప్రభుత్వం తరపున కొన్ని ప్రాధాన్యతగల, ముఖ్యమైన అభివృద్ధి కార్యక్రమాల అమలుకు కృషి జరుగుతోంది. నిర్మాణ బలహీనతలను అధిగమించేందుకు, ప్రజలతో సంబంధాలను ముందుకు తీసుకెళ్లేందుకు ప్రయత్నం జరుగుతోంది. బెంగాల్ ఉద్యమంపై జరుగుతోన్న దాడికి సామ్రాజ్యవాద సంస్థల సాయం అందుతోంది. మొత్తంగా దేశంలో వామపక్ష ఉద్యమాన్ని బలహీనం చేసేందుకే పార్టీపై బహుముఖ దాడి జరుగుతోంది. ఈ నేపథ్యంలో పార్టీ యావత్తూ బెంగాల్ కమిటీ వెనుక నిలబడుతోంది. పార్టీనీ, పార్టీ నాయకత్వాన్నీ విమర్శించేందుకూ, పార్టీ విధానాలను వక్రీకరించేందుకూ కార్పొరేట్ మీడియా మొత్తం ఏకమౌతోంది. గత కొన్నేళ్లుగా సమాజంలోని వివిధ రంగాల్లోకి సామ్రాజ్యవాదం లోతుగా చొచ్చుకుపోయింది. సామ్రాజ్యవాద ప్రయోజనాలతో మిళితమైన శక్తులు కూడా వామపక్ష వ్యతిరేక భావజాలాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాజకీయ అంశాలపై పనితోపాటు సైద్ధాంతిక ప్రచారాన్ని కూడా పార్టీ పెద్ద ఎత్తున చేపట్టాలి. సాంస్కృతిక రంగంలోకీ విస్తరించాలి.
స్వతంత్ర పాత్రే పురోగమనానికి కీలకం : బెంగాల్, కేరళ, త్రిపుర రాష్ట్రాల వెలుపల కూడా పార్టీ బలపడటానికి స్వతంత్ర పాత్రే కీలకం. వర్గ దృక్పథం ఆధారంగా పార్టీ రాజకీయ-సైద్థాంతిక కృషిని పెంచుకోవాలి. అన్ని ముఖ్యమైన అంశాలపైనా పార్టీ జోక్యం చేసుకోవాలి. పెట్టుబడిదారీ పార్టీల సిద్ధాంతాలనూ, రాజకీయాలనూ తిప్పికొట్టాలి. పునాదివర్గాల్లో పార్టీ పనికి ప్రాధాన్యతనివ్వాలి. దళితులు, మైనార్టీలు, గిరిజనులు, మహిళలకు సంబంధించిన నిర్దిష్ట అంశాలపై పనిచేయాలి. స్థానిక అంశాలపై డిమాండ్లు పరిష్కారమయ్యేవరకూ నిలకడైన పోరాటాలు చేయడం ప్రధానమైన కర్తవ్యంగా ఉండాలి. ఇందుకోసం పార్టీ నిర్మాణంలో పోరాటాల ఒరవడిని తేవాలి.
పోరాటాలను ఉధృతం చేయాలి : ఈ ఏడాది సెప్టెంబర్ ఏడున జాతీయ సమ్మె చేయాలని తొమ్మిది జాతీయ కార్మిక సంఘాలు ఉమ్మడిగా పిలుపునిచ్చాయి. బొగ్గు, బిఎస్‌ఎన్‌ఎల్, స్టీల్ రంగాల వారీగా రానున్న రోజుల్లో జాతీయ ఆందోళనలు జరగనున్నాయి. ఈ పోరాటాలకు ఎంతో ప్రాధాన్యత ఉన్నప్పటికీ, నూతన ఆర్థిక విధానాలను ప్రతిఘటించడానికి ఇవి సరిపోవు. రేగా అమలు కోసం, ఆహార భద్రత కోసం, ప్రజా పంపిణీ వ్యవస్థ సార్వత్రీకరణ కోసం మనం ఉద్యమాలు చేపట్టాలి. విశాలమైన ప్రజా ఉద్యమాలు, ఆందోళనలపైన, ఉమ్మడి కార్యాచరణపైన మనం ప్రధానంగా దృష్టి కేంద్రీకరించాలి. కులవివక్ష, అంటరానితనానికి వ్యతిరేకంగా, రంగనాథ్‌మిశ్రా నివేదిక అమలు కోసం, మహిళాబిల్లు ఆమోదం కోసం, గిరిజన అటవీ హక్కుల చట్టం అమలు కోసం రానున్న రోజుల్లో పార్టీ ప్రచారాందోళన కార్యక్రమం చేపట్టాలి.వామపక్షాల ఐక్యత : ఇటీవలి కాలంలో వామపక్షాల ఉమ్మడి పిలుపులు, ఉమ్మడి చొరవ పెరిగాయి. ధరల పెరుగుదలపై మార్చి 12 ర్యాలీ మొదలుకొని అఖిలభారత హర్తాళ్ వరకూ జరిగాయి. స్వతంత్ర పాత్రలో భాగంగా మనం వామపక్ష, ప్రజాతంత్ర ప్రత్యామ్నాయాన్ని ముందుకు తేవాలి. మరిన్ని ఉమ్మడి కార్యాచరణల ద్వారా వామపక్ష ఐక్యతను పెంపొందించాలి. పార్టీకి దూరంగా వెళ్లిన వామపక్ష శక్తులను పునరేకీకరించేందుకు కృషి చేయాలి.
తక్షణ కర్తవ్యాలు
1. అన్ని తరగతుల ప్రజల జీవితాలపై తీవ్ర దుష్ప్రభావం చూపుతోన్న నూతన ఆర్థిక, సరళీకరణ విధానాలకు వ్యతిరేకంగా పోరాడటమే కీలక కర్తవ్యం. సామ్రాజ్య వాద ప్రపంచీకరణలో భాగంగా అమలౌతోన్న ఈ విధానాలు సంపన్నులను మరింత సంపన్నులను చేస్తున్నాయి. అమూల్యమైన వనరులను కార్పొరేట్, బడా పెట్టుబడిదారీ శక్తులకు ధారాదత్తం చేస్తున్నాయి. కార్మిక ప్రయోజనాలకు తీవ్ర విఘాతం కల్గిస్తోన్న ఈ విధానాలను కాంగ్రెస్ నేతృత్వంలోని యుపిఎ ప్రభుత్వం గత ఆరేళ్లుగా అమలు చేస్తోంది.
2. నూతన ఆర్థిక విధానాలకు వ్యతిరేకంగా జరిగే పోరాటం రెండు స్థాయిల్లో జరగాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలకు వ్యతిరేకంగా...ఉపాధి, భూమి, ఉద్యోగ భద్రత, కనీస వేతనాలు, విద్య, వైద్య తదితర కనీస సదుపాయాల అమలు తదితర డిమాండ్ల ఆధారంగా, నూతన ఆర్థిక విధానాలకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాలు చేపట్టడం ద్వారా ఈ పోరాటం సాగాలి. స్థానిక సమస్యలపై పార్టీ, ప్రజా సంఘాలు సమరశీల పోరాటాలు చేపట్టాలి.
3. మతోన్మాద ఎజెండాను ముందుకు తీసుకువెళ్లే ప్రయత్నం జరుగుతోన్న నేపథ్యంలో మతోన్మాద రాజకీయాల ప్రమాదం కొనసాగుతోంది. ఆర్‌ఎస్‌ఎస్, బిజెపి మెజార్టీ మతోన్మాదానికి, హిందూత్వ సిద్ధాం తానికి ప్రాతినిథ్యం వహిస్తున్నాయి. రానున్న కాలంలో మెజార్జీ మతోన్మాదంతోపాటు మైనార్టీ మతోన్మాదం, తీవ్రవాద ప్రమాదాలపైనా జాగురూ కతతో ఉండాలి.
4. రక్షణ రంగంతోపాటు అన్ని రంగాల్లోనూ అమెరికాతో భాగస్వామ్యాన్ని బలోపేతం చేసుకునేందుకు యుపిఎ ప్రయత్నిస్తోంది. ఈ భాగస్వామ్యం జాతీయ రాజకీయా లను ప్రభావితం చేస్తోంది. దేశ స్వతంత్ర విదేశాంగ విధానానికి ఇది ప్రధాన అవరోధంగా ఉంది. వివిధ రూపాల్లోని భారత్-అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యా నికి వ్యతిరేకంగా పార్టీ ఉధృతంగా ఆందోళన చేపట్టాలి. ఇందుకోసం దేశభక్త, ప్రజాతంత్ర శక్తులను ఏకం చేయాలి.
5. యుపిఎ ప్రభుత్వం నూతన ఆర్థిక విధానాలను మరింత ముందుకు తీసుకెళ్తున్నందుకు కారణమైన కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించాలి. ఆ పార్టీ అమెరికా అనుకూల విదేశాంగ విధానానికి మొగ్గు చూపడమే కాక, దేశంలోని బడా పెట్టుబడిదారుల ప్రయోజనాల కోసం పనిచేస్తోంది.
6. బిజెపి మతోన్మాద రాజకీయాలను మాత్రమే అవలంబించడం లేదు. నూతన ఆర్థిక విధానాలను సమర్ధించే మితవాద పార్టీ అది. పార్టీ బిజెపిపై రాజకీయంగా పోరాడుతుంది. ఆ పార్టీని ఒంటిరి చేసే విధంగా లౌకికశక్తులన్నింటినీ సమీకరించే ఎత్తుగడల ను అవలంబిస్తుంది.
7. ప్రజా సమస్యలపై ఉమ్మడి పోరాటాలకు సిద్ధమైన కాంగ్రేసేతర లౌకిక పార్టీల మధ్య సహకారం కోసం పార్టీ కృషి చేస్తుంది. అవసరమైన సందర్భంలో అటువంటి పార్టీలతో ఎన్నికల అవగాహన కుదర్చుకుంటుంది.
8. స్వతంత్ర పాత్ర, కార్యాచరణపై పార్టీ కేంద్రీకరిస్తుంది. వామపక్ష ప్రత్యామ్నాయాలను పార్టీ ప్రజలముందు ఉంచుతుంది. వామపక్ష శక్తులను సంఘటితం చేసేందుకు, వామపక్ష ఐక్యతను బలోపేతం చేసేందుకు కృషి చేస్తుంది. మావోయిస్టులు చేపడుతోన్న ఆటంక చర్యలకు వ్యతిరేకంగా పార్టీ నిర్ణయాత్మకంగా పోరాడుతుంది.
9. బెంగాల్‌లోని సిపిఎం, వామపక్షాలకు అండగా ప్రజలనూ, ప్రజాతంత్ర శక్తులనూ సమీకరించేందుకు పార్టీ యావత్తూ కృషి చేస్తుంది. తద్వారా హింసాయుత దాడులను తిప్పికొట్టేందుకూ, ప్రస్తుత ప్రతికూల పరిస్థితిని అధిగమించేందుకూ సాయం చేస్తుంది.
10. వామపక్ష, ప్రజాతంత్ర డిమాండ్ల వేదికగా కార్మిక, కర్షక, వ్యవసాయ కార్మికులను, చేతివృత్తులవారినీ పార్టీ సమీకరిస్తుంది. జీవనోపాధిపై పెనుప్రభావం చూపుతోన్న ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటానికి వారిని సంసిద్ధులను చేస్తుంది.
11. దళితులు, గిరిజనులు, మైనార్టీలు, మహిళలు తదితర అణగారిన వర్గాల ప్రజల హక్కులకై జరిగే పోరాటాలకు పార్టీ ముందుండి నాయకత్వం వహిస్తుంది.
No comments:
Post a Comment