- జానపదమే జనజీవితంగా ' జజ్జనకరి జనారే'
సిపిఎం అఖిల భారత విస్తృత సమావేశాలను పురస్కరించుకొని ఏర్పాటైన ప్రజా కళాసంబరాలు రాష్ట్రంలోని పలుప్రాంతాల విశిష్టతనూ, వాటి సాంస్కృతిక వైభవ ప్రాభవాన్నీ, జనపదాల శ్రమైక జీవన కళా సౌందర్యాన్నీ వెలికి తీశాయి. విజయవాడ జింఖానా మైదానం (విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ కళావేదికపై)లో ఈనెల ఐదు నుంచి ఎనిమిది వరకూ నాలుగు రోజులపాటు 'జజ్జకనరి జనారే' పేరిట ప్రజాకళా సంబరాలను ప్రజానాట్యమండలి (పిఎన్‌ఎం) నిర్వహించింది. నాలుగు రోజులపాటు ప్రదర్శించిన ఐదు నాటికలు వేటికవే ప్రత్యేకతను సంతరించుకొన్నాయి. భిన్న ఇతివృత్తాలతో వీక్షకుల మెదళ్లను పదునెక్కించాయి.'రసఝురి' పొన్నూరు వారు ప్రదర్శించిన 'సంపద' నాటిక ప్రపంచీకరణ వల్ల మాతృ, మానవ సంబంధాల మనుగడకే ప్రమాదం ఏర్పడిన నేపథ్యాన్ని వివరించింది. 'ఈ కథలు మార్చి చెప్పండి' నాటిక ప్రేక్షకులను ఎంతగానో ఆలోచింపచేసింది. ఆవుల్ని వేటాడే పులులు, జింకల్ని మింగేసే సింహాలు, బలహీనుల్ని దోచుకునే బలవంతులదే నడుస్తున్న చరిత్ర అనీ, బలహీనులే ఏకమై బలవంతుడ్ని ఎదుర్కోవాలన్నదే ఈనాటిక సారాంశం.
ఓహౌం బీం' నాటిక ప్రదర్శన కూడా పలువురి మెప్పు పొందింది. చిరకాలం జరిగిన మోసాలు, బలవంతుల దౌర్జన్యాలు, ధనవంతుల పన్నాగాలు 'ఇంకానా ఇకపై సాగవు' అని సందేశమిచ్చింది. సామ్రాజ్యవాదులు తమ వ్యాపారాలను విస్తృత పరుచుకోవడం ద్వారా లాభాలను దండుకునేందుకు మానవుణ్ణి వినిమయ బానిసగా మార్చేయడానికి ఇడియట్ బాక్స్ (టెలివిజన్)ను ఏ విధంగా ఉపయోగించుకుంటున్నదీ 'విజన్ పాయిజన్' నాటిక సాక్షాత్కరింపచేసింది. తరతరాల తెలుగు భాషా ఔనత్యాన్నీ, విశిష్టతనూ తెలియజెప్పిందీ 'తెలుగు వెలుగు' నాటిక. నాటికలేగాక ఈ నాలుగు రోజులూ కళావేదికపై వైవిధ్యభరిత కళారూపాలు ప్రదర్శితమయ్యాయి.
No comments:
Post a Comment