- ప్రారంభోపన్యాసంలో ప్రకాశ్ కరత్
- ఉత్సాహపూరిత వాతావరణంలో సిపిఎం విస్తృత సమావేశాలు ప్రారంభం
నయా ఉదారవాద విధానాలు దేశంలోని అత్యధిక ప్రజానీకం మనుగడకు శ్రేయస్కరం కాదనీ, ప్రత్యామ్నాయ విధానాల అమలు ద్వారానే ప్రజలను రక్షించగలమని సిపిఎం ప్రధాన కార్యదర్శి ప్రకాశ్ కరత్ అన్నారు. వామపక్షాలు అధికారంలో ఉన్న మూడు రాష్ట్రాల్లో ప్రత్యామ్నాయ విధానాలు అమలు చేసి చూపుతున్నామని పేర్కొన్నారు. ప్రత్యామ్నాయ విధానాల అమలు కోసం రాజకీయంగా, సాంఘికంగా మార్పుల కోసం వామపక్షాల ఐక్యతను బలోపేతం చేయడం, విశాల ప్రాతిపదికన వామపక్ష, ప్రజాతంత్ర శక్తుల మద్దతు కూడగట్టడమే మార్గమని స్పష్టం చేశారు. సిపిఎం జాతీయ విస్తృత సమావేశాలు తుమ్మలపల్లి కళాక్షేత్రం (షహీద్‌నగర్)లో శనివారం ఉత్సాహపూరిత వాతావరణంలో ప్రారంభమయ్యాయి. కరత్ ప్రారంభోపన్యాసం చేస్తూ
ప్రస్తుతం దేశంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులు, ఎదురైన సవాళ్లు, వాటిని ఏ విధంగా ఎదుర్కోవాలనే అంశాలపై రాజకీయంగా తీసుకోవాల్సిన విధానంపై సమావేశాల్లో చర్చిస్తామన్నారు. నిత్యావసర వస్తువుల ధరలు పెరగడం వల్ల అత్యధిక ప్రజలపై పెనుభారం పడిందనీ, కోట్లాది మంది ఆకలితో అలమటిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ధనికులు, పేదల మధ్య అంతరాలు రోజురోజుకూ పెరుగుతున్నాయని చెప్పారు. స్థూల జాతీయోత్పత్తి (జిడిపి) పెరుగుతోందంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని యుపిఎ ప్రభుత్వం చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. ఈ కాలంలో పేదలు మరింత పేదలవుతుండగా కోటీశ్వరులు శత కోటీశ్వరులవుతున్నారని పేర్కొన్నారు. పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు అత్యధిక లాభాలు ఆర్జించడానికీ, ఆర్థిక వనరులను వారి వశం చేయడానికి ప్రభుత్వంలో విధానాలు రూపొందుతున్నాయన్నారు.
సంస్కరణల జోరు - ప్రజల బేజారు
యుపిఎ-2 అధికారంలోకొచ్చాక నయా ఉదార విధానాల అమలు మరింత వేగం పుంజుకుందన్నారు. పెట్టుబడుల ఉపసంహరణలో భాగంగా లాభాల్లో నడుస్తున్న అన్ని ప్రభుత్వరంగ సంస్థల్లోని వాటాలను అమ్ముతోందని చెప్పారు. వ్యవసాయం సంక్షోభంలో కూరుకుపోవడం వల్ల దేశంలోని శ్రామికుల్లో సగం మందిపై ఆ ప్రభావం పడిందన్నారు. ప్రభుత్వం భూ సంస్కరణలను పట్టించుకోకపోగా వ్యవసాయాన్ని కార్పొరేటీకరి స్తోందనీ, వ్యవసాయరంగంలో ప్రభుత్వ పెట్టు బడులను ఉపసంహరిస్తోందని విమర్శించారు. బహుళజాతి సంస్థలను చిల్లర వర్తకంలోకి అను మతించేందుకు ప్రయత్నిస్తోందని చెప్పారు. బీమా, బ్యాంకింగ్ రంగాల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను (ఎఫ్‌డిఐ) అనుమతించేందుకు పార్లమెంటులో చట్టం తీసుకొస్తోందన్నారు. నిత్యావసరాలతో సహా సామాన్య ప్రజలు ఉపయోగించే ప్రతి ఒక్క వన్తువు ధరా పెరగడానికి ఈ విధానాలే కారణమన్నారు. పెట్రోలియం ఉత్పత్తుల ధరల పెంపు, ఆహార ధాన్యాల ఫార్వర్డ్ ట్రేడింగ్ ప్రధానంగా నిత్యావసర వస్తువుల ధరలు పెరగానికి కారణమని చెప్పారు. ప్రజా పంపిణీ వ్యవస్థ (పిడిఎస్)ను బలహీన పరచడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. ప్రజల చెంతకు ప్రభుత్వం అంటున్న కాంగ్రెస్ నేతల మాటలు వాగాడంబరమేననీ, వాస్తవానికి ప్రజలకు ఆహారం, విద్య, ఉపాధి, సాంఘిక భద్రత దూరమ య్యాయని విమర్శించారు. ఆకలి, పోషకాహార లోపంతో అలమటిస్తున్న ప్రజలు భారతదేశంలో అత్యధికంగా ఉండటం సిగ్గుచేటన్నారు. 'ఎఫ్‌సిఐ గోదాముల్లో ఆరు కోట్ల టన్నుల ఆహార ధాన్యాలు మూలుగుతున్నాయి. వాటిని ప్రజలకు పంపిణీ చేయకుండా ఎలుకలకు ఆహార భద్రత కల్పిస్తున్నారు' అని ఎద్దేవా చేశారు. జిడిపిలో విద్యకు ఆరు శాతం, ఆరోగ్యానికి మూడు శాతం నిధులు కేటాయిస్తామన్న హామీ అమలు కాలేదన్నారు.
సవాలు విసురుతున్న మతోన్మాదం
మెజారిటీ మతోన్మాదం దేశానికి ప్రమాదంగా పరిణమించిందనీ, ప్రజల మధ్య ఐక్యతకు భంగం కలిగిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. బిజెపి అధికారంలో ఉన్న గుజరాత్, మధ్య ప్రదేశ్, కర్నాటక రాష్ట్రాల్లో మైనార్టీలకు రక్షణ లేకుండా పోయింద న్నారు. కాశ్మీర్‌లో చోటు చేసుకున్న సంఘటనలతో ఆ రాష్ట్రంలో ఉద్రి క్తత నెలకొందని ఆవేదన వెలిబుచ్చారు. కేంద్రం తక్షణం స్పందించి కాశ్మీర్‌లోని ఆయా సెక్షన్లతో చర్చలు జరపాలని కరత్ డిమాండ్ చేశారు. మణిపూర్‌లో వేర్పాటువాదులు తమ ఆందోళనల్లో భాగంగా హైవేలను దీర్ఘకాలం దిగ్బంధించడం వల్ల నిత్యావసర సరుకులు, మందులు అందక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు.
ఐపిఎల్, టెలికాం, కామన్వెల్త్ కుంభకోణాలు
నయా ఉదారవాద విధానాలు సమాజాన్ని కలుషితం చేస్తున్నాయని, అవినీతి పెరిగిపోతోందని కరత్ ఆందోళన వ్యక్తం చేశారు. రాజకీయాల్లోకి బడా వ్యాపారులు అడుగు పెట్టారని, గాలి బ్రదర్స్ బిజెపి నేతృత్వంలోని కర్నాటక ప్రభుత్వాన్ని శాసిస్తున్నారనీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని సైతం ప్రభావితం చేస్తున్నారని చెప్పారు. ఐపిఎల్, టెలికం, కామన్వెల్త్ క్రీడల కుంభకోణాలు రాజకీయ అవినీతికి నిదర్శనాలని విమర్శించారు. ప్రజాధనం కొందరు కాంట్రాక్టర్లు, బ్యూరోక్రాట్లు, రాజకీయ నాయకుల జేబుల్లోకి పోతోందన్నారు. కార్పొరేట్ మీడియా నయా ఉదారవాద విధానాలకు సహకరిస్తున్నదన్నారు. ప్రత్యేక ఆర్థిక మండళ్లు (సెజ్) సహా పెద్ద వ్యాపార సంస్థల్లో ట్రేడ్ యూనియన్లపై నిషేధం, ఆందోళనలపై పోలీసుల నిర్బంధం, విద్యా సంస్థల్లో విద్యార్థి సంఘాల నిషేధం వంటి చర్యలను ప్రభుత్వం చేపడుతోందన్నారు. మన్మోహన్‌సింగ్ ప్రభుత్వానికి అమెరికా ప్రయోజనాలు మినహా ప్రజలు, జాతి సమైక్యత, అభివృద్ధి పట్టడంలేదని విమర్శించారు. అందులో భాగంగానే అణు ఒప్పందం కుదుర్చుకుందనీ, పార్లమెంటులో బిల్లు తేవడానికి ప్రయత్నిస్తోందని కరత్ చెప్పారు.
నయా ఉదారవాద విధానాలు, అమెరికా సామాజ్యవాదానికి వత్తాసు పలికే పాలకవర్గాలను సిపిఎం వ్యతిరేకిస్తోందన్నారు. అందుకే సిపిఎం నేతృత్వంలోని పశ్చిమబెంగాల్ ప్రభుత్వంపై దాడి జరుగుతోందని వివరించారు. కార్పొరేట్ మీడియా, సామ్రాజ్యవాదం కక్ష కట్టాయన్నారు. బెంగాల్‌లో తృణమూల్, మావోయిస్టు మూకల దాడుల్లో సిపిఎంకు చెందిన 250 మంది సభ్యులు, సానుభూతి పరులు హత్యకు గురయ్యారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజాతంత్ర హక్కులపై దాడులు జరుగుతున్నాయన్నారు. సిపిఎంను లక్ష్యంగా చేసుకొని హత్యలు చేయడం ద్వారా మావోయిస్టుల ప్రజాతంత్ర వ్యతిరేకత వెల్లడయిందని విమర్శించారు. వామపక్షాలు అధికారంలో ఉన్న బెంగాల్, కేరళ, త్రిపురలో ప్రజానుకూల విధానాలు అమలు జరుగుతున్నాయని కరత్ చెప్పారు. గత లోక్‌సభ ఎన్నికల్లో బెంగాల్, కేరళలో వామపక్షాలకు, సిపిఎంకు ఇబ్బందులు ఎదురయ్యాయని తెలిపారు. ఈ పరిస్థితులపై సిపిఎం కూలంకషంగా చర్చించి సవాళ్లను అధిగమించడానికి చర్యలు చేపడుతుందన్నారు. బెంగాల్, కేరళలో ప్రజలు పరిస్థితులను అర్థం చేసుకుని పార్టీ వైపు, వామపక్ష కూటమి వైపు వచ్చేలా చర్యలు చేపడుతున్నామని చెప్పారు. ప్రస్తుతం దేశానికి సిపిఎం, వామపక్షాలే నిజమైన ప్రత్యామ్నాయమని కరత్ పేర్కొన్నారు.
ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలకు ప్రత్యామ్నాయ విధానాలను సిపిఎం ప్రతిపాదిస్తోందన్నారు. వ్యవసాయ సంక్షోభం, ఆత్మహత్యల నివారణకు కార్పొరేటీకరణను విరమించుకొని, వ్యవసాయ ఉత్పాదకాలను సరసమైన ధరలకు సరఫరా చేయాలని సూచించారు. రైతులకు ప్రోత్సాహకాలు ఇవ్వాలన్నారు. సార్వజనీన పిడిఎస్‌ను అమలు చేయాలన్నారు. ప్రభుత్వ రంగాన్ని బలోపేతం చేయాలనీ, కార్మికుల ఉపాధి లక్ష్యంగా పారిశ్రామికీకరణ జరగాలని ప్రతిపాదించారు. విదేశీ పెట్టుబడులను నియంత్రించాలనీ, అధిక పన్నుల విధానాన్ని అమలు చేయాలని కోరారు. నల్ల ధనాన్ని వెలికి తీయాలన్నారు. కార్పొరేట్ సంస్థలపై పన్నులు పెంచి ప్రభుత్వానికి ఆదాయం తెచ్చుకోవాలనీ, తద్వారా విద్య, వైద్య రంగాలకు ప్రభుత్వ నిధులు అధికంగా ఖర్చు చేయాలనీ, లౌకికవాదాన్ని నిష్కర్షగా అమలు చేయాలనీ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మతతత్వ శక్తులకు ఎటువంటి మినహాయింపులు ఇవ్వరాదని కరత్ డిమాండ్ చేశారు. కులవివక్షను, లింగ భేదాన్ని నిర్మూలించాలనీ, లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు తేవాలనీ, రంగనాథ్ మిశ్రా సిఫారసుల మేరకు మైనార్టీలకు రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. అవినీతి, అక్రమ మైనింగ్‌ను నిరోధించాలన్నారు. గిరిజనులకు,సాంప్రదాయ అటవీ వాసులకు అటవీ భూములపై హక్కులు కల్పించాలని కోరారు. భారత్ స్వతంత్ర విదేశాంగ విధానాన్ని అమలు చేయాలని, వర్ధమాన దేశాల హక్కుల పరిరక్షణకు కృషి చేయాలని సూచించారు.
No comments:
Post a Comment