- విజయవాడ సదస్సులో సీతారాం ఏచూరి
ఈ నాలుగు బిల్లుల్లో ఉన్నత విద్యను దెబ్బతీసే అంశాలుఎక్కువగా ఉన్నాయని ఏచూరి అన్నారు. దీనిలో భాగంగా యుజిసి, ఎఐసిటిఇని రద్దుచేసి 'నేషనల్ కమిషన్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్' పేరిట ఆరుగురితో ఒక కమిటీని ఏర్పాటు చేస్తోందన్నారు. దీనిలో రాష్ట్ర ప్రభుత్వాల నుండి ఎవరికీ ప్రాతినిధ్యం ఉండబోదన్నారు. ఉన్నత విద్యారంగ అభివృద్ధికి సంబంధించి ప్రభుత్వం చేసే అనేక చట్టాలను ఇప్పటివరకూ యుజిసి పర్యవేక్షిస్తోందనీ, రద్దు చేయడం వల్ల కేంద్రం చేసే నిర్ణయాలను పర్యవేక్షించే వారెవ్వరూ ఉండరని ఏచూరి తెలిపారు. చట్టాలు చేయడం, అమలు చేయడం ఒకరి చేతుల్లోనే ఉండడంవల్ల పర్యవేక్షణ ఉండదనీ, కేంద్రం చెప్పిందే వేదమవుతుందని తెలిపారు. దీనివల్ల రాష్ట్రాల్లో విద్యారంగంలో ఉత్పన్నమయ్యే సమస్యల పరిష్కారంపై కేంద్రం దృష్టి సారించే అవకాశం ఉండబోదని అన్నారు. ఏ మాత్రమూ ఉపయోగంలేని ఇటువంటి చట్టాలను వ్యతిరేకించాల్సిన అవసరం ఉందన్నారు. ఉపాధ్యాయ సంఘాలు దీనిపై పోరాడాలన్నారు. అయితే ప్రతి ఒక్కరికీ విద్య అందించే దిశగా విద్యావ్యవస్థలో మార్పులు రావాల్సి ఉందన్నారు.
దీని కోసం సిపిఎం సభ్యులుగా పార్లమెంటులో పోరాడుతున్నామని తెలిపారు. అలాగే విదేశీ విశ్వవిద్యాలయాలకు అనుమతివ్వాలనే బిల్లును కూడా కాంగ్రెస్ సిద్ధం చేసిందన్నారు. ప్రపంచంలో అన్ని ప్రాంతాల్లో భారతదేశానికి చెందిన ఉన్నత విద్యావంతులు వివిధ రంగాల్లో ఉన్నారని తెలిపారు. యూరోపియన్ యూనియన్‌లోని 28 దేశాల్లో ఏటా తయారవుతున్న విద్యావంతులకు రెండింతల మంది భారతదేశంలో తయారవుతున్నారన్నారు. అయినా ప్రభుత్వం లెక్కల ప్రకారం ప్రతి వంద మందిలో తొమ్మిది మంది మాత్రమే ఉన్నతవిద్యకు చేరుకుంటున్నారని తెలిపారు. ఇటువంటి స్థితిలో విద్యారంగానికి తీవ్ర నష్టం కలిగించే విదేశీ విశ్వవిద్యాలయాలకు అనుమతివ్వడం వల్ల అతికొద్దిగా తయారవుతున్న ఉన్నత విద్యావంతుల సంఖ్య మరింత తగ్గిపోయే ప్రమాదం ఉందన్నారు. భవిష్యత్తులో భారతదేశంలో విద్యారంగం తీవ్రంగా నష్టపోతుందన్నారు. కేరళ విద్యాశాఖా మంత్రి ఎంఎ బేబీ మాట్లాడుతూ రాష్ట్రాల్లో విద్యారంగం బాధ్యతల నుండి కేంద్రం తప్పుకోవాలని చూడటం విద్యావ్యవస్థకే గొడ్డలిపెట్టన్నారు. యుపిఎ-1 ప్రభుత్వ హయాంలో మంచి చట్టాలను రూపొందించడానికి కారణం వామపక్షాల మద్దతు ఉండడమేనన్నారు. కానీ యుపిఎ-2 ప్రభుత్వం అన్ని రంగాలనూ ప్రయివేటు పరం చేయడంలో భాగంగా విద్యా రంగం నుండి కూడా తన బాధ్యతను తప్పుకోజూస్తోందని విమర్శించారు.
ఇటీవల జాతీయ విద్యాహక్కు చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకువచ్చిందనీ, అయితే ఈ చట్టంలో ఆరు నుంచి14 సంవత్సరాలలోపు విద్యార్థులకు మాత్రమే నిర్భంధ విద్య అని పేర్కొన్నారనీ, కానీ 18 సంవత్సరాలలోపు విద్యార్థులందరికీ ఉచిత నిర్బంధ విద్యను అమలు చేయాల్సిన అవసరముందని చెప్పారు. ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు, యుటిఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా యుటిఎఫ్ నాయకులు సుభాష్ చంద్రబోస్ రాసిన 'మెడికల్ రీయింబర్స్‌మెంట్' అనే పుస్తకాన్ని ఏచూరి ఆవిష్కరించారు.
No comments:
Post a Comment