- సోమవారం ఉదయం నుంచే ప్రయాణం
- అరుణపతాకాలతో ఎర్రబారిన రైళ్లు
- విజయవాడకు చేరుకున్న వేలాది ప్రజా రథాలు
విజయవాడ పరిసర ప్రాంతాలయిన తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ఖమ్మం, నల్గొండ జిల్లాల నుంచే భారీ సంఖ్యలో సభకు ప్రజలు బయలుదేరనున్నారు. ''మాకు గూడు చూపించిన
ఎర్రజెండా పార్టీ సభకు వేకువజామునే రైలెక్కి పోతున్నా'' అంటూ ఏలూరులో ఓ మహిళా కార్మికురాలు ఉత్సాహం ప్రదర్శించారు. ''మిల్లు పనులన్నీ కట్టిపెట్టి సిపిఎం ఊరేగింపుకెళ్తున్నా'' జూట్ మిల్లు కార్మికుడొకరు ప్రజాశక్తికి తెలిపారు. తాడేపల్లిగూడెం, భీమవరం తదితర ప్రాంతాలకు చెందిన అసంఘటిత రంగ కార్మికులు కూడా తాము బయలుదేరుతున్నట్లు తెలిపారు. డెల్టాలో వ్యవసాయ కార్మికులు సైతం సభకు బయల్దేరుతున్నారు. కృష్ణాజిల్లాలోని అన్ని మండలాల నుంచీ వాహనాలు బయలుదేరుతున్నట్లు సమాచారం అందింది.
గుంటూరు జిల్లా నుంచి బహిరంగ సభకు వెళ్లేందుకుగాను జిల్లా వ్యాపితంగా వాహనాలను సమకూర్చుకుంటున్నారు. ప్రకాశం జిల్లా నుంచి జనతరంగం కదలనుంది. ఒంగోలు సమీప ప్రాంతాల నుంచి యువకులు మోటారు సైకిల్ యాత్ర చేపట్టనున్నారు. కర్నూలు జిల్లా నంద్యాల, ఆదోని, పత్తికొండ, డోన్, కర్నూలు తదితర ప్రాంతాల నుంచి వేెలాది మంది రైళ్లలో బయలుదేరారు. ఆత్మకూరు, నందికొట్కూరు ప్రాంతాల నుంచి ప్రత్యేక వాహనాల్లో తరలి వెళ్లారు. మహబూబ్‌నగర్ జిల్లా నుంచి సోమవారం ఉదయమే కార్యకర్తలు బయలుదేరారు. అనంతపురం జిల్లా నుంచి రైల్లో బయల్దేరారు. శ్రీకాకుళం జిల్లా నుంచి పూరి-తిరుపతి ఎక్స్‌ప్రెస్, విశాఖ ఎక్స్‌ప్రెస్‌ల్లో పయనమయ్యారు. విజయనగరం, పార్వతీపురం, బొబ్బిలి, సీతానగరం, గజపతినగరం, కొత్తవలస ప్రాంతాల నుంచి వందలాది మంది సోమవారం సాయంత్రం రైలులో బయల్దేరారు. విశాఖలో వేలాది మంది రత్నాచల్ ఎక్స్‌ప్రెస్‌లో ఎక్కారు. సభకు వెళ్లేవారితో విశాఖ రైల్వేస్టేషన్ ఆవరణ రోజంతా అరుణపతాకాల రెపరెపలతో కొత్త అందాన్ని సంతరించుకుంది. ఆదిలాబాదు జిల్లా నుంచి ఎర్ర దండు కదిలింది. నిజామాబాద్ నుంచి కూడా వేలాది మంది సోమవారం బయలుదేరారు.
ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లాల నుంచి వేలాది మంది పయనం
ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాల నుండి పార్టీ సానుభూతిపరులు, సిపిఎం శ్రేణులు తరలనున్నాయి. ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతోంది. ఖమ్మం జిల్లా నుంచి వేలాది మంది ఎర్రచొక్కా, ఎర్రచీర ధరించిన కార్యకర్తలు బయలు దేరారు. వరంగల్ నుంచి మంగళవారం ఉదయం నాలుగు గంటలకు ఫ్యాసింజర్ రైలులో వేలాది మంది బయలుదేరారు. నల్గొండ జిల్లాలో కార్యకర్తలు స్వయంగా బస్సులు, టాటా సుమోలు, డిసిఎం వ్యాన్లతోపాటు రైళ్లలోనూ బయలుదేరారు. నెల్లూరు జిల్లా నుంచి అధిక సంఖ్యలో ఛార్మినార్, సింహపురి, తిరుమల, సర్కార్ ఎక్స్‌ప్రెస్ రైళ్లలో బయలుదేరారు. కడప జిల్లా నుంచి సోమవారం ఇంటర్‌సిటీ రైల్లో పార్టీ కార్యకర్తలు, నాయకులు తరలివెళ్లారు.
No comments:
Post a Comment