- రాజకీయ అండదండలతోనే 'కుల దురంహకార హత్యలు'
- సిపిఎం హర్యానా కార్యదర్శి ఇంద్రజిత్
అసలు సమస్య గోత్రాలు కాదు
ఒకే గోత్రానికి చెందిన అబ్బాయి, అమ్మాయి ప్రేమించుకోవడం, పెళ్లి చేసుకోవడమే పరువు పేరిట జరిగే హత్యలకు కారణమని ప్రచారం జరుగుతోంది. అది వాస్తవం కాదు. ఒకే గోత్రానికి చెందిన వ్యక్తులు దగ్గరవ్వడం మా రాష్ట్రంలో అరుదుగానే జరుగుతోంది. రాష్ట్రంలోని అగ్రవర్ణాలు ముఖ్యంగా జాట్‌లు కులాంతర వివాహాలను ఏమాత్రమూ సహించే పరిస్థితిలో లేరు. రాటి, పునియ, దయ్యా, గుడ్డా తదితర గోత్రాలు జాట్‌లలోను, దళిత కులాల్లోనూ ఉన్నాయి. మొత్తంగా కులాంతర వివాహాల పట్ల అగ్రవర్ణాలకున్న వ్యతిరేకతే ఈ హత్యలకు కారణం.
కుల వ్యవస్థను సంరక్షించేందుకే..
మారిన సామాజిక, ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో కులవ్యవస్థ బలహీనపడుతుండటం వాస్తవం. ఈ విషయం జాట్‌లతో పాటు ఇతర అగ్రవర్ణాలకు రుచించడం లేదు. కులాధిపత్యం బలహీనపడితే గ్రామీణ ప్రాంతాల్లో తమ ఆర్థిక, రాజకీయ ఆధిపత్యమూ కనుమరుగవుతుందని వారు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఎప్పుడో మధ్య యుగాల నాటి ఖాప్ పంచాయితీలను తిరిగి తెరపైకి తెస్తున్నారు. తమకు తామే నాయకులుగా ప్రకటించుకున్న అగ్రవర్ణ నేతలు పరువు పేరిట హత్యలు చేయాలని ఆదేశాలు జారీ చేస్తున్నారు. రాష్ట్రంలో దళితులపై జరిగిన దాడులన్నింటినీ ఖాప్ పంచాయితీలు సమర్ధిస్తున్నాయి. దాడులకు పాల్పడిన వారిని నిర్దోషులుగా పేర్కొంటూ తీర్మానాలూ చేస్తున్నాయి. ఖాప్‌ల ఆర్ధిక ఆధిపత్య ధోరణికి ఇదే నిదర్శనం.
ప్రధానంగా బలౌతోంది యువతులే
ఇతర కులస్థులను ప్రేమించారనో, పెళ్లి చేసుకున్నారనో తల్లిదండ్రులు తమ పిల్లలను హత్య చేయడం నమ్మశక్యంగా ఉండదు. నిజమే..ఇది నమ్మశక్యంకాని కఠిన వాస్తవం. ఎక్కువ సంఘటనల్లో ఖాప్ పంచాయితీల ఒత్తిడి మేరకే తల్లిదండ్రులు, బంధుమిత్రులు ఇటువంటి తీవ్ర చర్యలకు పాల్పడుతున్నారు. ఖాప్‌ల నుండి రక్షణ కల్పిస్తామని మేం హామీ ఇచ్చి పలువురు యువతులను కాపాడగలిగాం. సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణ పేరుతో ఒక విధమైన భావోద్వేగ పరిస్థితిని సృష్టించేందుకు అగ్రవర్ణాలు ప్రణాళికాబద్ధంగా పని చేస్తున్నాయి. పరువు పేరిట జరిగే హత్యల్లోనూ లింగ వివక్షే మనకు కనిపిస్తుంది. పరువు పేరిట జరిగే హత్యలకు ప్రధానంగా బలౌతోంది యువతులే.
సాంస్కృతిక వైరుధ్యం
గత రెండు దశాబ్ధాలుగా అమలౌతోన్న నూతన ఆర్థిక విధానాలు దేశంలో విలువలను దిగజార్చిన విషయం తెలిసిందే. వినిమయతత్వం, పాశ్యాత్య సంస్కృతిని గుడ్డిగా అనుసరించడం, మహిళలను బజారు సరుకులుగా చూడటం, విచ్చలవిడితనం తదితర పరిణామాలు ఆధునిక యువతకు, సంప్రదాయాలను వల్లించే పెద్దలకు మధ్య సహజంగానే వైరుధ్యాన్ని సృష్టించాయి. ఈ విలువల పతనం స్థానంలో ప్రజాస్వామిక, పురోగామి సంస్కృతి వెల్లివిరియాలన్నది ప్రగతిశీలుర అభిప్రాయం. ఛాందసవాద విధానాలను పునరుద్ధరించడం ద్వారానే ఆధునిక యువతను అదుపు చేయవచ్చని, విలువల పతనాన్ని అరికట్టవచ్చని ఇప్పుడు అగ్రవర్ణాలు ప్రచారం చేస్తున్నాయి. ఈ వాదనకు సహజంగానే సులభంగా మద్దతు లభిస్తుంది. ఈ విధంగా కుల వ్యవస్థ ఘనీభవించడం బడా పెట్టుబడిదారులకు, సామ్రాజ్యవాదులకూ లాభిస్తుంది. ప్రజలు ఎంతగా విభజించబడితే వారి దోపిడీ అంత సవ్యంగా సాగుతుంది.
రాజకీయ అండే కీలకం
ఖాప్ పంచాయితీలను అధికార కాంగ్రెస్‌తో పాటు బిజెపి, ఐఎన్‌ఎల్‌డిలు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో సమర్ధిస్తున్నాయి. వామపక్షాలు మాత్రమే ఇందుకు మినహాయింపు. సిపిఎం, ఇతర ప్రజా సంఘాలు ఈ అంశంపై రాష్ట్రంలో ప్రచారాందోళన చేపడుతున్నాయి. ఖాప్ పంచాయితీలకు ఎన్‌జిఒల వలె పరిగణించాలని, పంచాయితీలు ఇచ్చే తీర్పులకు చట్టబద్ధత కల్పించాలని ఇటీవల ఖాప్ మహాసభ తీర్మానించింది. ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టింది రాష్ట్ర బిజెపి ప్రధాన నేత రామచంద్ర జగడానే. ఇటువంటి పార్టీలే గ్రామీణ ప్రాంతాల్లో ఓట్లు కోసం ఖాప్ పంచాయితీలను సమర్ధిస్తున్నాయి. ప్రజా సమస్యలను మరుగున పడేసేందుకు, కులదురంహకార హత్యలను వారు ఉద్దేశపూర్వకంగా ప్రోత్సహిస్తున్నారు.
హర్యానాలోనే ఎందుకంటే..
ఖాప్ పంచాయితీల వివాదం హర్యానాలోనే ఎక్కువగా ఎందుకన్న సందేహం సరైనదే. మొత్తంగా హిందీ రాష్ట్రాల్లోనే సాంఘీక సంస్కరణ ఉద్యమాలు చారిత్రకంగా బలహీనంగా ఉన్నాయి. హర్యానా తదితర రాష్ట్రాల్లో స్వాతంత్రోద్యమ ప్రభావమూ తక్కువే. పైగా నిఖార్సైన భూస్వామ్య గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు హర్యానా మంచి ఉదాహరణ. దీంతో సహజంగానే సమాజంలో అభివృద్ధి వ్యతిరేక, తిరోగామి, ఛాందస భావజాలం ఎక్కువగా ఉంది. ఆర్థికాభివృద్ధితో సమానంగా సాంఘీక అభివృద్ధి జరగకపోవడమూ ఒక ముఖ్య కారణం. ప్రజాతంత్ర ఉద్యమం బలపడితేనే ప్రస్తుత పరిస్థితి మారే అవకాశం ఉంది. కులదురంహకార హత్యల వంటి అంశాలపై ప్రజాస్వామిక శక్తులన్నీ ఏకమవ్వాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వాలు కూడా చట్టాలను మరింత పకడ్బందీగా అమలు చేయాలి.
No comments:
Post a Comment