- అస్థిత్వ రాజకీయాలతో ప్రజా సమస్యలు పక్కదారి
- ప్రజాశక్తి ఇంటర్వ్యూలో ప్రకాశ్ కరత్
పశ్చిమ బెంగాల్, కేరళ శాసనసభలకు 2011 మేలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆ రాష్ట్రాల్లో ఎటువంటి రాజకీయ ఎత్తుగడలు, వ్యూహాలు అనుసరించాలనే అంశంపై సమావేశాల్లో చర్చిస్తామన్నారు. రెండు రాష్ట్రాల్లో ఎన్నికల దృష్ట్యా ఈ ఏడాది జరగాల్సిన పార్టీ అఖిల భారత మహాసభల్ని వాయిదా వేశామన్నారు. ఇదే సమయంలో వివిధ రాష్ట్రాల్లోని తాజా రాజకీయ పరిణామాలను చర్చించేందుకు జాతీయ స్థాయిలో ఒకసారి సమావేశం కావాల్సిన అవసరమున్నందువల్ల మొట్టమొదటిసారిగా కేంద్ర కమిటీ విస్తృత సమావేశాలను నిర్వహిస్తున్నామని వివరించారు. కేంద్రంలోని యుపిఎ-2 అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు, దేశంలో రాజకీయ, సామాజిక మార్పు ఆవశ్యకత, అస్థిత్వ రాజకీయాలు. నిరుద్యోగం తదితర అంశాలపై కరత్ విపులంగా మాట్లాడారు. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే...
వేగంగా నయా ఉదారవాద విధానాలు
వామపక్షాల మద్దతుతోనే అధికారంలో కొనసాగినందువల్ల యుపిఎ-1 ప్రభుత్వం కొన్ని ప్రజానుకూల, ప్రజోపయోగ కార్యక్రమాలను తన కనీస ఉమ్మడి కార్యక్రమం (సిఎంపి)లో చేర్చింది. వాటి అమలును మాత్రం విస్మరించింది. యుపిఎ-1తో పోలిస్తే యుపిఎ-2 విధానాలు మరింతగా దిగజారాయి. గతంలో అమలు చేయలేకపోయిన సంస్కరణలను ప్రస్తుత ప్రభుత్వం ఇష్టారా జ్యంగా అమలు చేసేందుకు ప్రయత్నిస్తోంది. ప్రభుత్వాలు, పాలకవ ర్గాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటాలతో పాటు ప్రత్నామ్నాయాలపై కూడా సమావేశాల్లో చర్చిస్తాం.
రాజకీయ, సామాజిక మార్పు అవసరం
ప్రస్తుతం దేశంలో రాజకీయ, సామాజిక మార్పు రావాల్సిన అవసరముంది. అప్పుడే పాలకవర్గాలు అనుసరిస్తున్న విధానాల్ని సమర్థవంతంగా తిప్పికొట్టగలం. అందుకు 'వామపక్ష-ప్రజాతంత్ర ప్రత్యామ్నాయం' అవసరం. ఈ ప్రత్యామ్నాయంలో కేవలం వామపక్షాలనే కాకుండా ఇతర లౌకిక పార్టీలనూ భాగస్వాముల్ని చేయాలనేది మా ప్రయత్నం. ఆ పార్టీలు కలిసి వస్తాయని ఆశిస్తున్నాం. మనదేశం భిన్న భాషలు, భిన్న సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు కలిగి భిన్నత్వంలో ఏకత్వాన్ని ప్రదర్శిస్తోంది. అయితే దురదృష్టవశాత్తూ దేశంలో ప్రస్తుతం అస్థిత్వ రాజకీయాలు రాజ్యమేలుతున్నాయి. కులం, ప్రాంతం పేరిట ఇవి నడుస్తున్నాయి. జనాన్ని పట్టిపీడించే సమస్యల నుండి ఇవి ప్రజల దృష్టిని మరలుస్తున్నాయి. వీటిలో కొన్నింటికి రాజకీయపరమైన కారణాలు కూడా ఉన్నాయి. ఉదాహరణకు దేశంలో దళితులపై సాగుతున్న వివక్ష వల్ల దళిత రాజకీయాలు కొనసాగుతున్నాయి. గిరిజన లేదా ఆదివాసీ రాజకీయాలు కూడా ఇలాంటివే. వీటన్నింటినీ సమర్థవంతంగా ఎదుర్కోవాలంటే శ్రామికవర్గ సమస్యలను ఎప్పటికప్పుడు వెలికితీస్తూ వాటిపై పోరాడటమే మార్గం.
అందువల్ల వర్గ పోరాటాలను నిరంతరం కొనసాగిస్తూనే సామాజికాంశాలపైనా ఉద్యమించాలి. నిరుద్యోగ సమస్య దేశాన్ని పట్టిపీడిస్తోంది.. పెట్టుబడీదారి విధానంతో ఎంతో అభివృద్ధి సాధిం చామని చెప్పుకుంటున్న అమెరికాను సైతం ఈ సమస్య వేధిస్తోంది. ఆర్థిక సంక్షోభంతో అక్కడ నిరుద్యోగం మరింత పెరిగింది. ఇదే సమయంలో మన దేశంపై ఆర్థిక మాంద్య ప్రభావం ఎక్కువగా పడలేదు. యుపిఎ-1కు మద్దతిచ్చిన వామపక్షాలు దేశ ఆర్థిక వ్యవస్థను నిర్వీర్వం కాకుండా అడ్డుకోవటమే దీనికి ప్రధాన కారణం.
రెండు దశాబ్దాల్లో అతి పెద్ద ఆందోళన
పెట్రో ధరల పెంపుపై వామపక్షాలు, ఇతర లౌకిక పార్టీల ఆధ్వర్యాన నిర్వహించిన ఆందోళనలకు దేశవ్యాప్తంగా ప్రజలు పెద్దఎత్తున స్పందించారు. పెట్రో ధరలపై నియంత్రణను ఎత్తివేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకోవటం పట్ల వామపక్షాలు సహా 11 పార్టీల ఆధ్వర్యాన జూలై 5న దేశవ్యాప్తంగా జరిగిన హర్తాళ్ గత రెండు దశాబ్దాల కాలంలో జరిగిన అతిపెద్ద ఆందోళన. అంతకుముందు ధరల పెరుగుదలపై దేశవ్యాప్తంగా 13 పార్టీల ఆధ్వర్యాన నిర్వహించిన జైల్‌భరో కూడా విజయవంతమైంది. ఈ నేపథ్యంలో ప్రజా సమస్యలపై మున్ముందు మరిన్ని పోరాటాలు, ఆందోళనలు, ఐక్య ఉద్యమాలు నిర్మించాల్సిన అవసరముంది. వామపక్షాలు దేశంలోని కొన్ని ప్రాంతాల్లో బలంగా ఉంటే మరికొన్ని ప్రాంతాల్లో బలహీనంగా ఉన్నాయి. అందువల్ల వామపక్షాలతోపాటు ఇతర లౌకిక శక్తుల్ని ఒకే వేదికపైకి తీసుకువచ్చి ఐక్య ఉద్యమాలు నిర్వహించాలి.
No comments:
Post a Comment