సిపిఐ(ఎం) అఖిల భారత విస్తృత సమావేశాలు

సిపిఎం ఆఖిల భారత విస్తృత సమావేశాలు - ఆగస్ట్ 7నుండి 12వరకు విజయవాడలో...

సిపిఎం ఆఖిల భారత విస్తృత సమావేశాలు - ఆగస్ట్ 7నుండి 10వరకు విజయవాడలో...
సిపిఎం అఖిల భారత విస్తృత సమావేశాలు విజయవాడలో ఉత్సాహపూరితంగా ఉత్తేజభరితంగా శనివారం ప్రారంభ మయ్యాయి.  ఈ సమావేశాలకు దేశం నలుమూలల నుండి విచ్చేసిన  కమ్యూనిస్ట్ నాయకులకు, సమావేశ సంరంభాలను వీక్షించేందుకు  రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలనుండి తరలివచ్చిన కమ్యూనిస్టు యోధులు, యువ కమ్యూనిస్టులు, మహిళా నేతలు, శ్రేయోభిలాషులకు  విప్లవాభివందనాలు...

Saturday, August 7, 2010

ఆశయ పథంలో అలుపెరుగని యోధులకు ఎర్రెర్రని దండాలు

  •  
  • సాదర స్వాగతం పలికిన పాటూరు
సిపిఎం అఖిల భారత విస్తృత సమావేశాలకు అరుదెంచిన వివిధ రాష్ట్రాల ప్రతినిధులకు (ఆశయపథంలో అలుపెరుగని పోరాట యోధులకు) ఆహ్వాన సంఘం గౌరవాధ్యక్షులు, కేంద్ర కమిటీ సభ్యులు పాటూరు రామయ్య సమావేశ వేదిక నుంచి సాదర స్వాగతం పలికారు. శనివారం ఉదయం పదిన్నర గంటలకు విజయవాడ షహీద్‌నగర్‌ (తుమ్మలపల్లివారి క్షేత్రయ్య కళాక్షేత్రం)లో సిపిఎం అఖిల భారత విస్తృత సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాలు విజయవాడలో ఏర్పాటుకు అవకాశం కల్పించినందుకు పార్టీ పొలిట్‌బ్యూరో, కేంద్రకమిటీలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.
ఎందరో ప్రముఖ నేతలకూ, అనేక చారిత్రక ఉద్యమాలకూ, గొప్ప సభలకూ కార్యస్థానంగా విజయవాడ నిలిచిందన్నారు. జాతీయ, కమ్యూనిస్టు ఉద్యమాల్లో కృష్ణా నదికి ఇరువైపులా ఉన్న కృష్ణా, గుంటూరు జిల్లాల కీలక పాత్ర గురించీ ఆయన తెలియజేశారు. వీర తెలంగాణా విప్లవ పోరాటానికి ఈ జిల్లాలు తమ శక్తి మేరకు పూర్తి సహాయ సహకారాలు అందించాయనీ, ఇందులో వందల మంది ప్రాణాలర్పించారనీ తెలిపారు. ఈ స్ఫూర్తితో దివిసీమలో జరిగిన జమీందారీ వ్యతిరేక పోరాటంలో 43 మంది అమరులయ్యారన్నారు.


మాకినేని బసవపున్నయ్య, మోటూరు హనుమంతరావు, నండూరి ప్రసాదరావు, లావు బాలగంగాధరరావు, గుంటూరు బాపనయ్య, కొరటాల సత్యనారాయణ, చండ్ర రాజేశ్వరరావు, మద్దుకూరు చంద్రశేఖరరావు, చలసాని వాసుదేవరావు తదితరులు ఈ ప్రాంతంలోనే పుట్టి కమ్యూనిస్టు ఉద్యమంలో ముఖ్య నాయకత్వ పాత్ర నిర్వహించారన్నారు. పుచ్చలపల్లి సుందరయ్య రాజకీయ కార్యకలాపాల ప్రారంభవేదికగా ఈ జిల్లాలున్నాయన్నారు. విజయవాడ నగర పాలక సంస్థలో ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీల పాలన ఆదర్శంగా నిలిచిందన్నారు. రాష్ట్ర పాలకులు ఆంధ్రప్రదేశ్‌ను ప్రపంచబ్యాంక్‌ ప్రయోగశాలగా మార్చేశారన్నారు. ఈ కాలంలో లక్షల కోట్ల విలువైన సహజ వనరులు, 20 లక్షల ఎకరాల వ్యవసాయ, వ్యవసాయేతర, అటవీ భూములు సెజ్‌లు, ప్రాజెక్టులు పేరుతో కొద్ది మంది వ్యక్తులకు కట్టబెట్టారన్నారు. ఫలితంగా రాష్ట్రంలో ఇప్పటికే సుమారు వెయ్యి గ్రామాలు కనుమరుగయ్యాయని తెలిపారు. ఇంకొక పక్కన జీవించటానికి కొన్ని గజాలు స్థలమడిగిన పేద ప్రజలను వెంటాడి వేధిస్తున్నారనీ, కాల్పులు జరుపుతున్నారని తెలిపారు. బెంగాల్‌, కేరళ, త్రిపురలో సిపిఎం నేతృత్వంలోని వామపక్ష ప్రభుత్వాలు ప్రత్యామ్నాయ విధానాలను అమలు చేస్తున్నాయన్నారు. ప్రజా మద్దతుతో బెంగాల్‌ ప్రభుత్వం 33 సంవత్సరాలుగా అప్రతిహతపాలన సాగిస్తోందన్నారు.

బెంగాల్‌ ప్రభుత్వం భూ సంస్కరణల చట్టం కింద 13 లక్షల ఎకరాల మిగులు భూమిని పేదలకు పంచి దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. పారీశ్రామీకరణ ద్వారా యువతకు ఉపాధి కల్పించే దిశగా అనేక చర్యలు చేపట్టిందన్నారు. సామ్రాజ్యవాద శక్తులు, బడా పెట్టుబడిదారులు ,అభివృద్ధి నిరోధకులు దీన్ని ఓర్వ లేకపోతున్నారని తెలిపారు. అశాంతిని సృష్టించి వామపక్ష ప్రభుత్వాన్ని అస్థిరపరచాలని వారు చూస్తున్నారని చెప్పారు. ఆ శక్తుల కుట్రలను బెంగాల్‌ రాష్ట్ర కమిటీ సమర్ధవంతంగా ప్రతిఘటిస్తోందనీ ఇది స్ఫూర్తిదాయకంగా ఉందనీ తెలిపారు. సిపిఎం విస్తృత సమావేశాలు విజయవంతంగా నిర్వహించేందుకు ఆహ్వాన సంఘం శక్తివంచన లేకుండా కృషి చేస్తోందని ఆయన తెలిపారు. ఈ సమావేశాల ఏర్పాటుకు సహయపడిన విజయవాడ , కృష్ణా జిల్లాల ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు.

No comments:

Post a Comment