సిపిఐ(ఎం) అఖిల భారత విస్తృత సమావేశాలు

సిపిఎం ఆఖిల భారత విస్తృత సమావేశాలు - ఆగస్ట్ 7నుండి 12వరకు విజయవాడలో...

సిపిఎం ఆఖిల భారత విస్తృత సమావేశాలు - ఆగస్ట్ 7నుండి 10వరకు విజయవాడలో...
సిపిఎం అఖిల భారత విస్తృత సమావేశాలు విజయవాడలో ఉత్సాహపూరితంగా ఉత్తేజభరితంగా శనివారం ప్రారంభ మయ్యాయి.  ఈ సమావేశాలకు దేశం నలుమూలల నుండి విచ్చేసిన  కమ్యూనిస్ట్ నాయకులకు, సమావేశ సంరంభాలను వీక్షించేందుకు  రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలనుండి తరలివచ్చిన కమ్యూనిస్టు యోధులు, యువ కమ్యూనిస్టులు, మహిళా నేతలు, శ్రేయోభిలాషులకు  విప్లవాభివందనాలు...

Monday, August 9, 2010

శ్రీశ్రీ అంటేనే ఉత్తేజం

  • సీతారాం ఏచూరి
  • మహాకవికి షహీద్‌నగర్‌లో శతజయంతి నివాళి
సిపిఎం విస్తృత సమావేశాలు జరుగుతున్న షహీద్‌నగర్‌ (తుమ్మలపల్లివారి క్షేత్రయ్య కళాక్షేత్రం) ప్రాంగణంలో ఉన్న ప్రజాకవి శ్రీశ్రీ విగ్రహం వద్ద పార్టీ అగ్రనాయకులు, వివిధ రాష్ట్రాల ప్రతినిధులు మహాకవికి జేజేలు అర్పించారు. తన కలాన్నీ, కవిత్వాన్నీ కష్టజీవుల విముక్తికీ, కమ్యూనిస్టు ఉద్యమ వికాసానికీ అంకితమిచ్చిన శ్రీశ్రీ చిరస్మరణీయుడనీ వారు పేర్కొన్నారు. సోమవారం ఉదయం సిపిఎం సమావేశాలు జరుగుతున్న షహీద్‌నగర్లో ఉన్న శ్రీశ్రీ విగ్రహానికి ప్రతినిధులందరూ శతజయంతి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యులు సీతారాం ఏచూరి మాట్లాడుతూ కమ్యూనిస్టు భావజాలంతో ప్రేరణ పొందిన తొలితరం మహామేధావుల కోవలో శ్రీశ్రీ ప్రముఖుడన్నారు. ఆయన కవిత్వం, భాషా ప్రయోగం తెలుగునాట విప్లవ బీజాలు నాటాయన్నారు. తమ తరం వాళ్లకు విద్యార్థి దశలో ఉన్నప్పుడు శ్రీశ్రీ అనగానే ఉత్తేజం ఆవరించేదని గుర్తు చేసుకున్నారు. తన ప్రతిభను ప్రజలకే అంకితమిచ్చిన శ్రీశ్రీ కమ్యూనిస్టు ఉద్యమంతో మమేకమవడంలో ఆశ్చర్యం లేదంటూ ప్రసిద్ధ చిత్రకారుడు పికాసోను ఉదహరించారు. భవిష్యత్తులో శ్రీశ్రీ ఒక ఉత్తేజ ప్రదాతగా నిలిచి ఉంటాడంటూ జోహార్లర్పించారు. సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు వరదరాజన్‌ మాట్లాడుతూ శ్రీశ్రీ కవిత్వాన్ని సుబ్రహ్మణ్యభారతి కవిత్వంతో పోల్చారు. జీవితమంతా చెన్నైలో గడిపిన శ్రీశ్రీతో తమకు ప్రత్యేక అనుబంధం ఉంటుందని చమత్కరించారు.

కేరళ విద్యాశాఖా మంత్రి ఎంఎ బేబీ మాట్లాడుతూ శ్రీశ్రీ కవితా పరిధి అత్యంత విశాలమైనదని పేర్కొన్నారు. కేరళలో ఇఎంఎస్‌ నంబూద్రిపాద్‌ నాయకత్వాన తొలి కమ్యూనిస్టు ప్రభుత్వం ఏర్పడినప్పుడు శ్రీశ్రీ స్వాగతించాడనీ, దాన్ని దుర్మార్గంగా తొలిగిస్తే అంతే శక్తిమంతంగా ఖండించారనీ గుర్తు చేశారు. సాహితీ స్రవంతి రాష్ట్ర అధ్యక్షులు తెలకపల్లి రవి మాట్లాడుతూ శ్రీశ్రీ తెలుగు సాహిత్యంలో విప్లవ భావాజాలన్ని ప్రతిధ్వనించిన తీరును వివరించారు. సంపన్నవర్గాల గురించి కాక శ్రమజీవుల గురించి రాస్తూ మరో ప్రపంచ నిర్మాణానికి సాగిపోవాలని ఆయన ఇచ్చిన పిలుపు నిరంతరం ఉత్తేజకరమన్నారు. కమ్యూనిస్టులతో అత్యంత క్లిష్ట సమయాల్లో కలిసి నడిచిన ఘటనలు గుర్తు చేశారు. ప్రజాకళలను గౌరవించి ప్రోత్సహించే కమ్యూనిస్టులు ఈ సమావేశంలో శ్రీశ్రీ శత జయంతి నివాళి సమర్పించడం అత్యంత సముచితంగా ఉందన్నారు. సిపిఎం పశ్చిమబెంగాల్‌ రాష్ట్ర కార్యదర్శి బిమన్‌బసు, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర కార్యదర్శి బివి రాఘవులు, పొలిట్‌బ్యూరో సభ్యులు ఎంకె పాంథే, బెంగాల్‌ సాంస్కృతిక విభాగం బాధ్యులు మృదుల్‌డే, అన్ని రాష్ట్రాల ప్రతినిధులు అత్యంత ఆసక్తిగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. శ్రీశ్రీ గురించి తెలుసుకున్నందుకు హర్షం వెలిబుచ్చారు. తొలుత సాహితీ స్రవంతి రాష్ట్ర కార్యదర్శి ఎస్‌.వెంకట్రావు స్వాగతం పలికారు. సాహితీ మిత్రులు, వాలంటీర్లు కార్యక్రమానికి హాజరయ్యారు. రాజకీయ ప్రధానంగా జరుగుతున్న ఈ సమావేశంలో సాంస్కృతిక పరిమళం అద్దిన ఈ కార్యక్రమాన్ని అందరూ హర్షించారు.

No comments:

Post a Comment