- కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యమే జటిలం చేసింది
- సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తరిగామి
ఇంటర్వ్యూ ఇచ్చారు.
ప్రస్తుతం కాశ్మీర్‌లో పరిస్థితి ఏమిటి ?
రాష్ట్రంలో పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉంది. అత్యధిక ప్రజలు, ముఖ్యంగా యువత అనునిత్యం నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. దశాబ్ధాల తరబడి తీవ్ర నిర్లక్ష్యానికి గురయ్యామన్న భావనే ప్రజలను ఆందోళనకు పురికొల్పుతోంది. ఇదే కీలకాంశం. ఇటువంటి ఆందోళన కొత్త కాకపోయినా, కొత్త రూపాల్లో సాగుతోంది. 1990 నుండీ రాష్ట్రంలో హింస విపరీతంగా పెరిగింది. కొంతమంది ఉగ్రవాదులు, పోలీసు బలగాలకు మధ్య కొనసాగుతోన్న యుద్ధంలో సామాన్యులు బలిపశువులవుతున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలోని ప్రతి కుటుంబమూ ఈ హింసా కార్యక్రమాల వల్ల ఏదో ఒక విధంగా నష్టపోయింది. అనేక సందర్భాల్లో భద్రతాదళాలు మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతున్నాయి. లాకప్ మరణాలు, నకిలీ ఎన్‌కౌంటర్లు తదితర పరిణామాలు వారిపట్ల ప్రజల్లో తీవ్ర ఆగ్రహాన్ని పెంపొందించాయి.
గత కొద్ది నెలలుగానే పరిస్థితిలో మార్పు రావడానికి కారణం ఏమిటి ?
2008లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు భారీ సంఖ్యలో ఓటింగ్‌లో పాల్గొన్నారు. అమర్‌నాథ్ భూ వివాదం నేపథ్యంలో కొత్తగా ఏర్పడ్డ నేషనల్ కాన్ఫరెన్స్-కాంగ్రెస్ కూటమి ప్రభుత్వంపై ప్రజలు ఎంతో ఆశ పెట్టుకున్నారు. యుపిఎ ఆధ్వర్యంలో శాంతి ప్రక్రియ ముందుకు వెళ్తుందని ఆశించారు. కానీ గత ఏడాదిన్నరగా పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఆశ నుండి ప్రజలు తీవ్ర నిరాశలోకి వెళ్లిపోయారు. ముఖ్యంగా ముంబై ఉగ్రవాద దాడుల అనంతరం పరిస్థితిలో చాలా మార్పు వచ్చింది. అప్పటివరకూ పాకిస్తాన్‌తో జరిగిన శాంతి చర్చలకు భారత ప్రభుత్వం ముగింపు పలికింది. శ్రీనగర్-ముజఫరాబాద్ రోడ్డు మార్గం ప్రారంభం, సరిహద్దు వాణిజ్యంపై కేంద్రీకరణ తదితర చర్యలు స్థానిక ప్రజల్లో విశ్వాసాన్ని పెంచాయి. ముంబై దాడుల అనంతరం ఇటువంటి చర్యలన్నింటికీ ప్రభుత్వం స్వస్తి పలికింది. గతంలో ప్రధాని అధ్యక్షతన రాష్ట్రంలో పలు గ్రూపులతో రౌండ్‌టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు. ఇటీవల కాలంలో అంతర్జాతీయంగానే కాక, దేశంలోనూ చర్చల ప్రక్రియ పూర్తిగా నిలిచిపోయింది. ఈ పరిణామాలన్నీ రాష్ట్ర ప్రజల్లో మరోసారి అభద్రతాభావాన్ని, అనిశ్చితిని పెంచాయి.
ఈ పరిస్థితికి ఎవరు బాధ్యత వహించాలి ?
ఖచ్చితంగా కేంద్రంలోని యుపిఎ ప్రభుత్వం, రాష్ట్రంలోని ఒమర్ అబ్దుల్లా ప్రభుత్వమే తాజా పరిణామాలకు బాధ్యత వహించాలి. ప్రజల్లో వెల్లువెత్తుతున్న నిరసనను సరైన కోణంలో పరిశీలించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిరాకరిస్తున్నాయి. పాలనా చర్యల ద్వారా (బలగాల మొహరింపు) సమస్యను పరిష్కరించాలనుకోవడం అవివేకం. లాఠీలు, తూటాలు, నిర్బంధంతో ప్రజల మనస్సులను ఎవ్వరూ ఎప్పటికీ గెలవలేరు. ఇటువంటి చర్యల వల్ల హింస మరింతగా ప్రజ్వరిల్లుతుంది. కొత్త ప్రాంతాలకు విస్తరిస్తుంది.
రాష్ట్రంలో తిరిగి సాధారణ పరిస్థితి తేవడానికి ఏం చేయాలి ?
ఇదివరకే చెప్పినట్లు, సమస్యను రాజకీయంగానే పరిష్కరించాలి. ప్రధాని అధ్యక్షతన జరిగిన రౌండ్‌టేబుల్ సమావేశానంతరం, కాశ్మీర్ సమస్యను అధ్యయనం చేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం పలు సబ్ కమిటీలను ఏర్పాటు చేసింది. ఆ కమిటీలన్నీ ఎన్నో సిఫార్సులతో తమ నివేదికలనూ సమర్పించాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల మెజార్టీ సిఫార్సులు అమలుకు నోచుకోలేదు. ఉదాహరణకు భద్రతా బలగాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని రద్దు చేయాలన్న సిఫార్సును కేంద్రం బేఖాతరు చేసింది. బలగాలను తగ్గించాలని నిపుణుల కమిటీ సిఫార్సు చేయగా, తాజాగా మరిన్ని బలగాలను రాష్ట్రానికి తరలించారు. ఆర్థికాభివృద్ధి అంశంపైనా కమిటీలు చేసిన పలు సిఫార్సులు కాగితాలకే పరిమితమయ్యాయి. ఈ నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పాకిస్తాన్‌తోను, రాష్ట్రంలోని పలు గ్రూపులతోనూ శాంతి చర్చలను పునరుద్ధరించాలి. ప్రజల వద్దకు వెళ్లి వాళ్ల కష్ట సుఖాలను అర్ధం చేసుకునేందుకు ప్రభుత్వ యంత్రాంగం ప్రయత్నించాలి. తక్షణం భద్రతా బలగాలు సంయమనం పాటించి, సాధారణ పరిస్థితుల పునరుద్ధరణకు కృషి చేయాలి.
తాజా ఆందోళనల్లో యువత ప్రధాన పాత్ర పోషంచడంపై మీరేమంటారు ?
ఇది ముఖ్యమైన పరిణామం. నానాటికీ పెరుగుతోన్న నిరుద్యోగం, అభివృద్ధిలేమి యువతలో తీవ్ర నిరాశా నిస్ప్రహలకు కారణమౌతున్నాయి. రాజకీయ పరిష్కారంతో పాటు ఉపాధి, అభివృద్ధి అంశాలపైనా నిర్దిష్ట ప్రయత్నాలు జరగాలి. రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించేందుకు చిత్తశుద్ధితో ప్రయత్నం జరగాలి. రాష్ట్ర యువతకు వివిధ ప్రభుత్వ రంగ సంస్థలు, కార్యాలయాల్లో ప్రత్యేకంగా ఉపాధి కల్పించేందుకు కేంద్రం ఒక విధానాన్ని రూపొందించాలి. కాశ్మీర్ తన ఉనికి, అభివృద్ధి కోసం దేశం వైపు చూస్తోంది. స్పందించాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది.
ప్రస్తుత పరిణామాల్లో బిజెపి, పిడిపి పాత్ర ఏమిటి ?
తాజా ఆందోళనలకు పిడిపినో మరో పార్టీనో కారణమని చెప్పడం సమగ్రంగా ఉండదు. విచ్ఛిన్నకర శక్తులు ఎప్పుడూ తమ అవకాశం కోసం ఎదురు చూస్తూనే ఉంటాయి. సామాన్యులు కూడా వీధుల్లోకి రావడం, ప్రధానంగా యువత, మహిళలు ఆందోళనల్లో భాగస్వాములవ్వడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. బిజెపి మాత్రం ప్రభుత్వ సైనిక చర్యలను పూర్తిగా సమర్ధిస్తోంది. రాజకీయ పరిష్కారంపై ఆ పార్టీ స్వాభావికంగానే విముఖత ప్రదర్శిస్తోంది. రాష్ట్రంలో మతోన్మాదాన్ని పెంపొందించడానికి తాజా పరిణామా లను ఉపయోగించుకోవాలని ఆ పార్టీ వ్యూహరచన చేస్తోంది.
No comments:
Post a Comment