- 'జజ్జనకరిజనారే' లో సినీ దర్శకుడు ఉమామహేశ్వరరావు
రాబోయే పరిణామాలను పసిగట్టి సమాజాన్ని మేల్కొలిపే దార్శినికులు కళాకారులేనని సినీ దర్శకుడు సి ఉమామహేశ్వరరావు అభివర్ణించారు. జానపద కళారూపాల సమ్మేళనం నిర్వహిస్తున్న ప్రజానాట్యమండలి కళాకారుల కృషి అభినందనీయమన్నారు. సిపిఎం అఖిల భారత విస్తృత సమావేశాల సందర్భంగా ప్రజానాట్యమండలి తలపెట్టిన' జజ్జనకరిజనారే'లో నాల్గోరోజు ఆదివారం సాయంత్రం జరిగిన సభలో ఆయన ప్రసంగించారు.
ప్రజానాట్యమండలి తొలినుంచీ జానపదకళలకు ప్రాధాన్యత ఇచ్చిందని గుర్తుచేశారు. ప్రాచీన, వర్తమాన విషయాలను వివరిస్తూ భవిష్యత్తుపై అవగాహన కల్గించడమే
ధ్యేయంగా ప్రజా కళాకారుల కృషి చేయాలని సూచించారు. సమాజానికి సరైన మార్గ దర్శకత్వం అందించే మహత్తర శక్తి మార్క్సిజానికే ఉందంటూ,కమ్యూనిస్టులే అనేక విషయాల్లో ప్రజలను ముందుగా మేలుకొలిపారన్నారు. కళాకారులు ఆ వెలుగులో పయనించి మరింత వేగంగా ప్రజా చైతన్యానికి, భాషా వికాసానికి కృషి చేయాలని కోరారు. సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు బిఆర్ తులసీరావు మాట్లాడుతూ శ్రమ నుంచి, సేద్యం నుంచి చెమట చుక్క నుంచి కళలు ఉద్భవించాయన్నారు. సభకు ప్రజానాట్యమండలి రాష్ట్ర నాయకులు ఎస్‌కె.వలి అధ్యక్షత వహించారు. నగర కార్యవర్శి బి శ్రీనివాసరావు కార్యక్రమాన్ని నిర్వహించారు. శ్రీకాకుళానికి చెందిన హేమసూదన్ బృందం తప్పెటగుళ్లు, ఉంగుటూరు బసవయ్య బృందం జంతరపెట్టె, వై సాయికుమార్ ప్రదర్శించిన భగత్‌సింగ్ ఏకపాత్రాభినయం, నందిగామ కళాకారుడు సిలివేరి వెంకట్రావు బృందం సన్నాయివాయిద్యం, ఆటో తవిటి నాయుడు 'హరిశ్చంద్ర నాటకంలో 'కాటిసీను' , గుంటూరు ప్రజానాట్యమండలి కళాకారులు' తెలుగు వెలుగు' రూపకం ప్రదర్శించారు.
No comments:
Post a Comment