సిపిఐ(ఎం) అఖిల భారత విస్తృత సమావేశాలు

సిపిఎం ఆఖిల భారత విస్తృత సమావేశాలు - ఆగస్ట్ 7నుండి 12వరకు విజయవాడలో...

సిపిఎం ఆఖిల భారత విస్తృత సమావేశాలు - ఆగస్ట్ 7నుండి 10వరకు విజయవాడలో...
సిపిఎం అఖిల భారత విస్తృత సమావేశాలు విజయవాడలో ఉత్సాహపూరితంగా ఉత్తేజభరితంగా శనివారం ప్రారంభ మయ్యాయి.  ఈ సమావేశాలకు దేశం నలుమూలల నుండి విచ్చేసిన  కమ్యూనిస్ట్ నాయకులకు, సమావేశ సంరంభాలను వీక్షించేందుకు  రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలనుండి తరలివచ్చిన కమ్యూనిస్టు యోధులు, యువ కమ్యూనిస్టులు, మహిళా నేతలు, శ్రేయోభిలాషులకు  విప్లవాభివందనాలు...

Monday, August 9, 2010

లాల్‌గఢ్‌ ర్యాలీపై ఏం చెబుతారు ?

  • కేంద్రాన్ని ప్రశ్నించిన కరత్‌
  • తృణమూల్‌ - మావోయిస్టుల మైత్రి బహిర్గతం
  • అణు ప్రమాదాలకు రియాక్టర్‌ కంపెనీలదే బాధ్యత
  • సవరణలు చేయకుంటే బిల్లును వ్యతిరేకిస్తాం
పశ్చిమ బెంగాల్‌లోని లాల్‌గఢ్‌లో సోమవారం తృణమూల్‌- మావోయిస్టులు సంయుక్తంగా నిర్వహిస్తున్న ర్యాలీ ద్వారా వారిద్దరి మైత్రీ బహిర్గతమైందని సిపిఎం ప్రధాన కార్యదర్శి ప్రకాశ్‌ కరత్‌ అన్నారు. తృణమూల్‌-మావోయిస్టుల సంబంధాలపై సాక్ష్యం కావాలని యుపిఎ ప్రభుత్వం అంటోందనీ, ఇంతకు మించిన సాక్ష్యం మరొకటి ఉండబోదని చెప్పారు. ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న తృణ మూల్‌కు మావోయిస్టులతో స్నేహంపై యుపిఎ సమా ధానం చెప్పాలనీ, తన వైఖరిని స్పష్టం చేయాలనీ డిమాండ్‌ చేశారు. బెంగాల్లో తృణమూలే తమ ప్రధాన ప్రత్యర్థని కరత్‌ చెప్పారు. అణు పరిహార బిల్లులో రియాక్టర్లను సరఫరా చేసిన సంస్థలను ప్రమాదాలకు బాధ్యులను చేయాలని స్పష్టం చేశారు. ముసాయిదా బిల్లుకు సిపిఎం ప్రతిపాదించిన సవరణలు చేయకపోతే పార్లమెంటులో బిల్లును వ్యతిరేకిస్తామని స్పష్టం చేశారు. నగరంలో జరుగుతున్న సిపిఎం జాతీయ విస్తృత సమావేశాలను పురస్కరించుకొని ఆదివారం మీడియా సెంటర్‌ (ప్రెస్‌క్లబ్‌)లో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో కరత్‌ మాట్లాడారు.

పోలీస్‌ అత్యాచారాల నిరోధక కమిటీ (పిసిపిఎ) సోమవారం లాల్‌గఢ్‌లో ర్యాలీకి పిలుపునిచ్చిందనీ, దానిలో పాల్గొంటున్నట్లు తృణమూల్‌  ప్రకటించిందనీ చెప్పారు. పార్టీ శ్రేణులే కాకుండా తృణమూల్‌కు చెందిన కేంద్ర మంత్రులు ఆ ర్యాలీలో పాల్గొంటున్నారన్నారు. పిసిపిఎను మావోయిస్టులు వెనకుండి నడిపిస్తున్నారనీ, సోమవారం జరుగుతున్నది తృణమూల్‌-మావోయిస్టుల సంయుక్త ర్యాలీ అనీ చెప్పారు. వారిద్దరి మైత్రిపై సాక్ష్యం కావాలంటున్న యుపిఎ ప్రభుత్వం ఇప్పటికైనా స్పందిం చాలనీ, జవాబు చెప్పాలనీ డిమాండ్‌ చేశారు. అణు పరిహార బిల్లుపై సిపిఎం, వామపక్షాలు సవరణలు ప్రతిపాదించాయనీ, ప్రభుత్వం ఆ సవరణలు చేస్తోందో, లేదో ముసాయిదా బయటికొస్తేగానీ తెలియదని కరత్‌ అన్నారు. అణు రియాక్టర్ల వల్ల ప్రమాదం జరిగితే పరి హారం చెల్లింపు విషయంలో నిర్వాహకులను మాత్రమే బాధ్యులను చేసి, వాటిని సరఫరా చేసిన సంస్థలను వదిలేయడాన్ని తప్పుపట్టారు. రియాక్టర్లను సరఫరా చేసిన సంస్థలను ప్రమాదాలకు బాధ్యులను చేయాలని డిమాండ్‌ చేశారు. తాము ప్రతిపాదించిన మేరకు బిల్లులో సవరణలు చేయకుంటే సిపిఎం, వామపక్షాలు పార్లమెంటులో బిల్లును వ్యతిరేకిస్తాయని చెప్పారు.
యుపిఎ ప్రభుత్వానికి వామపక్షాల మద్దతు ఉపసంహరణకు ముందు 2008లో కోయంబత్తూర్‌లో జరిగిన సిపిఎం మహాసభ రాజకీయ ఎత్తుగడలను ఆమోదించిందనీ, ఆ తర్వాత రాజకీయంగా అనేక మార్పులొచ్చాయని అన్నారు.

మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో పార్టీ రాజకీయ విధానం, ఎత్తుగడలకు మార్పులు చేయాల్సి వచ్చిందన్నారు. కేంద్ర కమిటీ ఆమోదించిన రాజకీయ విధాన ముసాయిదాపై విస్తృత సమావేశాల్లో చర్చలు జరుగుతున్నాయన్నారు. కోయంబత్తూరు మహాసభకూ, ఇప్పటికీ మధ్య రాజకీయంగా, నిర్మాణపరంగా, పార్టీ ప్రభుత్వాల విషయంలో సాధించిన విజయాలు, బలహీనతలపై సమీక్ష జరుగుతోందన్నారు. వివిధ రాష్ట్రాలకు చెందిన 40-45 మంది ప్రతినిధులు చర్చల్లో పాల్గొన్నారని తెలిపారు. రాజకీయ తీర్మాన ముసాయిదాకు సవరణల ప్రతిపాదనకు ప్రతినిధులను ఆహ్వానించామన్నారు. బెంగాల్‌, కేరళ శాసనసభలకు వచ్చే ఏడాదిఎన్నికలున్నందున ఆ రెండు రాష్ట్రాలపై సోమవారం ప్రత్యేకంగా తీర్మానం ప్రవేశపెడతామని పేర్కొన్నారు. తృతీయఫ్రంట్‌పై ఈ సమావేశాల్లో చర్చ జరగలేదని విలేకరులు అడిగిన ప్రశ్నకు కరత్‌ సమాధానం చెప్పారు. వివిధ రాష్ట్రాల్లో కొన్ని పార్టీలతో సిపిఎం ఎన్నికల అవగాహన కుదుర్చుకుంటోందనీ, ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలపై చట్టసభల్లోనూ, బయటా అవగాహనతో పోరాటాలు చేస్తున్నామని వివరించారు. యుపిఎ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించడంపై పార్టీలో భిన్నాభిప్రాయాలొస్తున్నాయన్న వార్తలపై అడిగిన ప్రశ్నకు ఆ నిర్ణయం సరైందేనని కేంద్ర కమిటీ పేర్కొందన్నారు.

కేంద్ర కమిటీ తీసుకున్న ఆ నిర్ణయాన్ని విస్తృత సమావేశాల్లో ప్రతినిధుల పరిశీలనకు పెట్టామన్నారు. మద్దతు ఉపసంహరణ నిర్ణయం సరైందేనని కేంద్ర కమిటీ ఏకగ్రీవంగా తీర్మానించిందని గుర్తు చేశారు. ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా జరిగే పోరాటాలకు సిపిఎం స్వతంత్రంగా కార్యాచరణ రూపొందించుకుంటోందనీ, వామపక్షాలు, కలిసొచ్చే ఇతర లౌకిక ప్రజాతంత్ర శక్తులను ఆ పోరాటాల్లో కలుపుకొని పోతోందని మరో ప్రశ్నకు జవాబు చెప్పారు. బిజెపి నాయకత్వంలోని ఎన్డీఏతో ఎట్టి పరిస్థితుల్లోనూ సంబంధం ఉండబోదన్నారు. యుపిఎ సర్కార్‌కు భవిష్యత్తులో మద్దతిస్తారా అన్న ప్రశ్నకు ఊహాగానాలెందుకన్నారు.బెంగాల్‌లో సిపిఎంను లక్ష్యంగా చేసుకొని దాడులు చేస్తున్న తృణమూల్‌ కాంగ్రెసే తమ ప్రధాన ప్రత్యర్థని కరత్‌ చెప్పారు. తృణమూల్‌ కూటమిలో కాంగ్రెస్‌ది చిన్న పాత్ర అని పేర్కొన్నారు. సింగూర్‌ విషయంలో బెంగాల్‌ ప్రభుత్వం అనుసరించిన విధానం సరైందేననీ, నందిగ్రామ్‌లో కొన్ని పొరపాట్లు జరిగాయని కేంద్ర కమిటీ నిర్ధారణకొచ్చిందనీ ఒక ప్రశ్నకు కరత్‌ జవాబు చెప్పారు. దేశంలో చాలా చోట్ల పరిశ్రమలకు భూములు సేకరిస్తున్నారనీ, సింగూర్‌లో అక్కడి ప్రభుత్వం ఇచ్చిన పునరావాస ప్యాకేజీ అన్నింటికంటే మెరుగైందనీ వివరించారు.

గత ఎన్నికల్లో సిపిఎం పలుచోట్ల ఓడిపోయిన విషయాన్ని విలేకరులు ప్రస్తావించగా రాజకీయ పార్టీలకు ఓడిపోవడం అనేది అసహజం కాదనీ, అయితే బెంగాల్‌లో వ్యతిరేక ఫలితాలు రావడం మాత్రం ఈ కాలంలో పార్టీకి ఎదురైన కొత్త అనుభవమని చెప్పారు. హిందీ రాష్ట్రాల్లో పార్టీ విస్తరణకు కృషి జరుగుతోందనీ, ఈ విషయంలో సంతోషంగా లేమనీ ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. సెజ్‌లపై కేంద్ర ప్రభుత్వ విధానాన్ని సిపిఎం వ్యతిరేకిస్తోందన్నారు. వేలాది ఎకరాల్లో సెజ్‌లకు భూములు సేకరించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. పరిశ్రమలకు కొంత భూమి కావాలనే విషయంలో పార్టీ స్పష్టంగా ఉందన్నారు. కేరళ ముఖ్యమంత్రి అచ్యుతానందన్‌ సమావేశాలకు రాకపోవడంపై విలేకరులు ప్రశ్నించగా ఆయుర్వేద వైద్యం చేయించుకుంటున్నారని కరత్‌ తెలిపారు. రాజకీయ విధానాన్ని కేంద్ర కమిటీ ఆమోదించినప్పుడు అచ్యుతానందన్‌ హాజరయ్యారన్నారు. పార్టీ అంతర్గతంగా చేపట్టిన దిద్దుబాటు ఉద్యమంపై సమావేశాల్లో చర్చించలేదని మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. పాత్రికేయుల సమావేశంలో పార్టీ కార్యదర్శివర్గ సభ్యుడు వై వెంకటేశ్వరరావు, రాష్ట్ర కమిటీ సభ్యులు ఎస్‌ వెంకట్రావు, సిహెచ్‌ బాబూరావు పాల్గొన్నారు.

2 comments:

  1. singuru,nandigramlalo prajalandaru vyathirekisthunnappudu akkada factorielu pettadamu avusaramaa?rendu chotla porapaatu chesaru.ikanainaa partini prajalaku daggara cheyandi,guddigaa maoistulanu vyathirekinchakandi,vaallu cheppe daantlo nijamundemo chudandi

    ReplyDelete
  2. ఒక మావోయిస్ట్ గానే మీకు ఈ ప్రశ్న అడుగుతున్నాను. మీ పార్టీ కార్మిక వర్గ పార్టీనా, బహుళజాతి కంపెనీల పార్టీనా? పశ్చిమ బెంగాల్ లో బుద్ధదేవ భట్టాచార్యుడు ఎవరి సంక్షేమం కొరకు పని చేస్తున్నాడు. గతంలో కాంగ్రెస్ కి చెందిన ముఖ్యమంత్రి సిద్ధార్థ శంకర రే నమ్మిన హింసావాదాన్నే ఇప్పుడు బుద్ధదేవ్ భట్టాచార్య నమ్ముతున్నాడు కదా.

    ReplyDelete