- దళితుల పట్ల 82 రకాల వివక్ష
- ఉద్యమాల వల్ల అరుంధతీయులకు 3 శాతం రిజర్వేషన్లు
- 'తమిళనాడు 'అంటరానితనం నిర్మూలన వేదిక'
- ప్రధాన కార్యదర్శి సంపత్
తమిళనాడు ప్రభుత్వం చూస్తుం దన్నారు. సిపిఎం అఖిల భారత విస్తృత సమావేశాల్లో పాల్గొనేందుకు విజయవాడకు వచ్చిన సంపత్ ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే...
వివక్షపై 1845 గ్రామాల్లో సర్వే
తమిళనాడులో దళితులపై కొనసాగుతున్న వివక్షకు సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా 22 జిల్లాల్లోని 1845 గ్రామాల్లో సర్వే నిర్వహించాం. ఎన్నో విషయాలు వెలుగులోకొచ్చాయి. దళిత సర్పంచ్‌లపై అడుగడుగునా అగ్రవర్ణాల పెత్తనం కొనసాగుతోంది. గ్రామ సామూహిక వనరుల్ని (చెరువులు, నీళ్ల ట్యాంకులు) దళితులు వినియోగించుకునే వీల్లేదు. వారి బట్టలు కూడా ఎవరూ ఉతకరు. మధురై జిల్లా ఉద్ధపురంలో అగ్రవర్ణాలవారు తమ ఆవాసాలకూ, దళితులు నివాసముంటున్న ప్రాంతాలకూ మధ్య 20 ఏళ్ల కిందట పెద్ద గోడను నిర్మించారు. ఇక్కడ దళితుల వాడల్లో కనీసం బస్‌షెల్టర్లు కూడా లేవు. ఈ గోడను 2008లో సిపిఎం ప్రధాన కార్యదర్శి ప్రకాశ్ కరత్ సందర్శించారు. దీన్ని తొలగించాలని డిమాండ్ చేస్తూ నిర్మూలన వేదికగా మేం పలు ఆందోళనలు నిర్వహించాం. తుదకు ప్రభుత్వమే దిగివచ్చి ఈ గోడను తొలగించింది. మణిప్పురం జిల్లా కాంగియనోలోని దేవాలయంలోకి వందల ఏళ్ల నుంచి దళితులను ప్రవేశించనివ్వరు. దీనిపై దళితుల్ని పెద్దఎత్తున సమీకరించి ఆందోళన నిర్వహించాం.
పోలీసులు మమ్మల్ని అడ్డుకున్నారు. వారి వలయాన్ని ఛేదించుకుని ఆలయంలోకి ప్రవేశించాం. పోలీసులు మాపై లాఠీలు ఝుళిపించారు. దళితవర్గానికి చెందిన సిపిఎం ఎమ్మెల్యే లదాను పోలీసులు చితకబాదారు. 110 మంది నాయకులతో పాటు పెద్దఎత్తున దళితుల్నీ, కార్యకర్తల్నీ పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనలపై 2009 సెప్టెంబరు 30న తమిళనాడు రాష్ట్రమంతటా నిరసన సెగలు మిన్నుముట్టాయి. ఈ ఒత్తిడి వల్ల ప్రభుత్వం దిగివచ్చి కాంగియానో దేవాలయంలోకి దళితుల్ని ప్రవేశింపజేయా లంటూ అధికారుల్ని ఆదేశించింది. ఫలితంగా ఆ ఆలయంలోకి దళితులు ఇప్పుడు స్వేచ్ఛగా ప్రవేశించగలుగుతున్నారు. ఇదే సందర్భంలో నాగపట్నం జిల్లా చెట్టిపాలెం దేవాలయంలోకి ప్రవేశించిన దళితులపై అగ్రకుల దురహంకారులు రాళ్లు రువ్వారు. రాష్ట్రవ్యాప్తంగా 13 ఆలయాల్లో ప్రవేశించబోయిన దళితులపై ఇలాంటి దాడులే జరిగాయి. ఈ దాడులు, దౌర్జన్యాలన్నిటినీ ప్రతిఘటించిన 'నిర్మూలన వేదిక' రాష్ట్రంలోని దాదాపు 15 ప్రముఖ దేవాలయాల్లోకి దళితుల్ని ప్రవేశం చేయించగలిగింది. ఇది మాకు పెద్ద విజయం. దారుణమేమిటంటే కోయంబత్తూరు నగరంలో కూడా అంటరానితనం, వివక్ష వేళ్లూనుకుని ఉన్నాయి. అక్కడి పెరియర్ నగర్‌లో ప్రధాన రహదారికి ఆనుకుని ఉన్న దళిత భూముల చుట్టూ అగ్రవర్ణాలవారు గోడ నిర్మించారు. దళితుల్ని సమీకరించి ఉధృత ఆందోళనలు నిర్వహించటం ద్వారా ఈ గోడను కూల్చగలిగాం. ఫలితంగా మెయిన్ రోడ్డుకు ఆనుకుని ఉన్న ఈ దళితుల భూములకు విపరీతంగా ధరలు పెరిగాయి. రానున్న కాలంలో ఈ సమస్యలపై మరిన్ని పోరాటాలు నిర్వహించాలని నిర్ణయించాం.
సబ్‌కోటా కోసం కమిషన్
తమిళనాడు జనాభాలో 30 లక్షల మంది (25 శాతం) అరుంధతీయులున్నారు. రోడ్లు ఊడ్చటం, చెత్తను ఏరటం, డ్రెయిన్లను శుద్ధి చేయటం తదితర పనులు చేస్తూ వీరు జీవిస్తున్నారు. ఎస్సీ రిజర్వేషన్లతో తమకు 18 శాతం సబ్ కోటా కల్పించాలని డిమాండ్ చేస్తూ గత 25 ఏళ్లుగా వీరు పోరాటం చేస్తున్నారు. 2007లో 'నిర్మూలన వేదిక' ఈ సమస్యపై దృష్టి సారించింది. ఈ డిమాండ్‌ను నెరవేర్చాలంటూ చెన్నైలో భారీ ప్రదర్శన నిర్వహించాం. వివిధ ప్రభుత్వ కార్యాలయాల వద్ద పికెటింగ్‌లు నిర్వహించాం.అన్ని జిల్లాల్లో ధర్నాలు నిర్వహించాం. మా ఆందోళనల ఫలితంగా ప్రభుత్వం ఒక కమిషన్‌ను వేసింది. క్షేత్రస్థాయిలో అన్ని అంశాలనూ క్షుణ్నంగా పరిశీలించిన ఈ కమిషన్ అరుంధతీయులకు ఎస్సీ కోటాలో 3 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని ప్రభుత్వానికి సూచించింది. దీనికి తమిళనాడు ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. ఫలితంగా విద్య, ఉద్యోగాల్లో అరుంధతీయులకు సబ్ కోటా రిజర్వేషన్ అమలవుతోంది. ఇప్పుడు మా రాష్ట్రంలో వేలాది మంది అరుంధతీయుల పిల్లలు ఇంజనీరింగ్, వైద్య కళాశాలల్లో చేరుతున్నారు. ఇది మేం సాధించిన మరో విజయం.
No comments:
Post a Comment