సిపిఐ(ఎం) అఖిల భారత విస్తృత సమావేశాలు

సిపిఎం ఆఖిల భారత విస్తృత సమావేశాలు - ఆగస్ట్ 7నుండి 12వరకు విజయవాడలో...

సిపిఎం ఆఖిల భారత విస్తృత సమావేశాలు - ఆగస్ట్ 7నుండి 10వరకు విజయవాడలో...
సిపిఎం అఖిల భారత విస్తృత సమావేశాలు విజయవాడలో ఉత్సాహపూరితంగా ఉత్తేజభరితంగా శనివారం ప్రారంభ మయ్యాయి.  ఈ సమావేశాలకు దేశం నలుమూలల నుండి విచ్చేసిన  కమ్యూనిస్ట్ నాయకులకు, సమావేశ సంరంభాలను వీక్షించేందుకు  రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలనుండి తరలివచ్చిన కమ్యూనిస్టు యోధులు, యువ కమ్యూనిస్టులు, మహిళా నేతలు, శ్రేయోభిలాషులకు  విప్లవాభివందనాలు...

Monday, August 9, 2010

ఎర్రజెండా నీడలోనే మహిళకు నిజమైన గౌరవం

  • బెంగాల్‌ మహిళా ఉద్యమ మణిపూస శ్యామలీ గుప్తా
కమ్యూనిస్టుల పాలనలోనే మహిళలకు సంపూర్ణ గౌరవం సాధ్యమౌతుందని సిపిఎం బెంగాల్‌ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యురాలు శ్యామలీ గుప్తా వ్యాఖ్యానించారు. పశ్చిమ బెంగాల్‌లో మూడున్నర దశాబ్ధాల వామపక్షాల పరిపాలనే ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు. మహిళా సాధికారత, స్వేచ్ఛ, రాజకీయ భాగస్వామ్యం, సమాన వేతనాలు తదితర నినాదాలను బూర్జువా పార్టీలు ఉపన్యాసాలకే పరిమితం చేయగా...సిపిఎం నేతృత్వంలోని బెంగాల్‌ ప్రభుత్వం ఆచరణలో అమలు చేసి చూపించిందని ఆమె సగర్వంగా చెప్పారు. మహిళా హక్కుల కోసం
గత 48 సంవత్సరాలుగా ఆమె అలుపెరుగని పోరాటం చేస్తున్నారు. రాష్ట్ర ఐద్వా మొట్టమొదటి కార్యదర్శీ ఆమే. దాదాపుగా ఐదు దశాబ్ధాల రాజకీయ జీవితంలో ఎన్నో పార్లమెంటరీ పదవులు వెతుక్కుంటూ వచ్చినా ఆమె సున్నితంగా తిరస్కరించారు. ' మహిళా ఉద్యమం ఎంతో కీలకమైనది. ఏ పోరాట విజయానికైనా మహిళల పాత్రే కీలకం. బహుళవర్గ సంఘమైనా, పునాది వర్గాలను విస్తృతంగా సమీకరించగలిగింది మహిళాసంఘమే. అందుకే శక్తిని, సమయాన్నీ పూర్తిగా మహిళా ఉద్యమానికే కేటాయిస్తున్నాను ' అంటారామె. సిపిఎం కేంద్ర కమిటీ విస్తృత సమావేశాల నేపథ్యంలో శ్యామలీ గుప్తా తన ఉద్యమానుభవాలను 'ప్రజాశక్తి'తో పంచుకున్నారు.

మార్క్సిజమే స్ఫూర్తి
కళాశాల రోజుల్లో మార్క్సిస్టు సిద్ధాంతం నన్ను విశేషంగా ఆకర్షించింది. తరతరాల దోపిడీపై మార్క్సు శాస్త్రీయ విశ్లేషణ, లెనిన్‌ ఆచరణాత్మక కార్యక్రమం తీవ్రంగా ప్రభావితం చేశాయి. ఈ నేపథ్యంలో 1962లో నేను రాష్ట్ర మహిళా ఉద్యమంలో పనిచేయడం ప్రారంభించాను. అనంతరం సిపిఎంలో చేరి మితవాదానికి వ్యతిరేకంగా పోరాడాము. కళాశాలలో అధ్యాపకురాలిగా ఉంటూనే 1967-69 మధ్య రాష్ట్రంలో జరిగిన భూపోరాటాల్లో పాల్గొన్నాను. ఈ సందర్భంగా మహిళలను ఉద్యమబాటలోకి తీసుకురావడం ఎంతో సంతృప్తినిచ్చింది. ఆ తర్వాత ఉద్యోగాన్ని వదలిపెట్టి పార్టీ పూర్తికాలం కార్యకర్తగా మహిళా ఉద్యమంలో మరింత చురుకుగా పాల్గొన్నాను. 1981 నుండి 1996 వరకూ రాష్ట్ర ఐద్వా కార్యదర్శిగా పనిచేశాను. ప్రస్తుతం సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యురాలిగా పనిచేస్తున్నాను. సుదీర్ఘకాలం మహిళా ఉద్యమంలో కొనసాగడానికి నా కుటుంబం అందించిన సహకారం కూడా కారణం. నా భర్త శంకర్‌ గుప్తా కూడా పూర్తికాలం కార్యకర్తే. రాష్ట్ర విద్యుత్‌ శాఖా మంత్రిగా ఆయన పనిచేశారు. నా కొడుకు కూడా యువజనరంగంలో చురుకైన పాత్ర పోషిస్తున్నాడు.
వామపక్ష పాలనలో గుణాత్మక మార్పు
1977 నుండీ నిరాటంకంగా పనిచేస్తున్న రాష్ట్ర వామపక్ష ప్రభుత్వం మహిళల జీవితాల్లో గుణాత్మక మార్పు తీసుకువచ్చిందనడంలో ఏమాత్రమూ అతిశయోక్తి లేదు. సిపిఎం ప్రభుత్వం చేపట్టిన భూ సంస్కరణలు మహిళల స్థితిగతులను పూర్తిగా మార్చేశాయి. రాష్ట్రంలో భార్యాభర్తల పేరుతో ఉమ్మడిగా భూపట్టా ఇచ్చే విధానం అమల్లోకి వచ్చింది. బిసి, ఎస్‌సి, ఎస్‌టి, మైనార్టీ స్త్రీలకే అధికశాతం భూమి లభించింది. కౌలు రైతు చట్టాల్లోనూ మహిళలకు సమాన హక్కులు కల్పించబడ్డాయి. పంచాయితీల్లోనూ స్త్రీలకు నిజమైన ప్రాతినిథ్యం, భాగస్వామ్యం లభించింది. నేడు రాష్ట్రంలో మొత్తం 18 జిల్లా పరిషత్‌లు ఉండగా, 11 చోట్లా మహిళలే ఛైర్‌పర్సన్‌లు. స్థానిక సంస్థల్లో ప్రస్తుతమున్న 33 శాతం రిజర్వేషన్‌ను త్వరలో 50 శాతానికి పెంచనున్నారు. రాష్ట్రంలోని టీ, బీడి పరిశ్రమల్లో అత్యధిక శాతం పురుషులతో సమానంగా స్త్రీలకు వేతనాలు లభిస్తున్నాయి. వ్యవసాయ కార్మిక స్త్రీలకూ దాదాపుగా సమాన వేతనాలు అందుతున్నాయి. మహిళల్లో విద్యాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక పథకాలను అమలు చేసి ఘనమైన విజయాలు సాధించింది. ఈ చర్యలన్నీ రాష్ట్ర మహిళల్లో సాధికారతను సాధించాయి. ఇంకా చేయాల్సింది ఉన్నప్పటికీ..ఒకటి మాత్రం చెప్పగలను. ఎర్రజెండా పాలన కారణంగానే నేడు బెంగాల్‌లో స్త్రీలు నిజమైన స్వేచ్ఛా, సమానత్వం పొందగలుగుతున్నారు.
సంఘటితమౌతోన్న మహిళాలోకం
గత 40 సంవత్సరాల్లో మహిళా ఉద్యమంలో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. వామపక్ష మహిళా ఉద్యమం నేడు ఒకే ఉమ్మడి ఎజెండాతో ముందుకు సాగుతోంది. బెంగాల్లో వేలాదిగా స్వయం సహాయ గ్రూపులను ఏర్పాటు చేయడంలో ఐద్వా కీలకపాత్ర పోషిస్తోంది. అనేక ఇతర రాష్ట్రాల్లోనూ పలు పోరాటాల రూపంలో మహిళలు సంఘటితమౌతున్నారు. గతంతో పోలిస్తే నేడు మహిళలు కొంత స్వేచ్ఛగా ఉద్యమాల్లోకి రాగల్గుతున్నారు. ఇక్కడ ఇంకో ప్రమాదం కూడా ముందుకొచ్చింది. ఇటీవలి కాలంలో తమ ప్రయోజనాలను కాపాడుకోవడం కోసం పాలకవర్గాలు కూడా మహిళలను సమీకరించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఫలితంగా సంఘటితంగా ముందుకెళ్లాల్సిన మహిళా ఉద్యమంలో పలు విభజనలకు ఆస్కారం ఏర్పడింది. ఈ సవాల్‌ను ఎదుర్కొనడమే మహిళా ఉద్యమం ముందున్న ప్రధాన కర్తవ్యం.

No comments:

Post a Comment